లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయింపు
హైదరాబాద్, ఆగస్టు 17: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ నగర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మరో వారం రోజుల్లో మెుదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రగతిభవన్‌లో కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఆ సమీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. మురికివాడల్లో నివసిస్తున్న పేదల గుడిసెలు తొలగించి అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించామని.. ఇప్పటికే 4,500 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందజేసామని చెప్పారు. మరో 70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వచ్చిన అఫ్లికేషన్ల ఆధారంగా ఇంటింటి సర్వే చేసి అర్హులను ఎంపిక చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందనన్న కేటీఆర్.. ఇప్పటి వరకు లెక్కతేలిన అర్హుల పేర్లతో వారంలో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని జీహెచ్‌ఎంసీకి అధికారులకు సూచించారు.అయిదు నుంచి ఆరు దశల్లో అక్టోబరు నాటికి మొత్తం ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలన్నారు. అర్హుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలన్నారు. లాటరీ రోజునే లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, ఇంటి తాళాలు ఇచ్చేట్లు విధానాన్ని రూపొందించాలన్నారు. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందుతుందని, అర్హుల నుంచి గృహలక్ష్మి పథకానికి అప్లికేషన్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ప్రకటనతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇళ్లులేని పేదలకు ఆశలు చిగురిస్తున్నాయి.