కొత్త ఎమ్మెల్సీలంతా నల్గోండ వాళ్లే
నల్గోండ, మార్చి 11, ( వాయిస్ టుడే )
All the new MLCs are from Nalgonda.
తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. తెలంగాణ విషయంలో పార్టీల ఆలోచనలు ఒకేలా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ సీట్లకు ఒకే జిల్లాకు చెందిన నలుగుర్ని ఆయా పార్టీలు ఎంపిక చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ జిల్లాకు రాజకీయ పార్టీలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఎట్టకేలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు సోమవారం చివరి తేదీ కావడంతో ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించారు. పుకార్లుకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ఒకరు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒకర్ని ఎంపిక చేశారు. ఐదుగురు అభ్యర్థులు సోమవారం ఉదయం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పోటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాయి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు. పార్టీలు ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారు ఉన్నారు. కేవలం విజయశాంతి మినహా ఆ నలుగురు ఆ జిల్లాకు చెందినవారే. గతంలో ఇలాంటి సందర్బం ఎప్పుడూ రాలేదన్నది కొందరు రాజకీయ నేతల మాట. దీనిబట్టి ఆ జిల్లాకు ఎంత ప్రయార్టీ ఇస్తున్నారో అర్థమవుతోంది.అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు. ఒకరు దామరచర్ల మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. ఎస్టీ కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది ఏఐఐసీ.మరో అభ్యర్థి అద్దంకి దయాకర్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్‌కు చెందిన వ్యక్తి. మాల మహానాడు నేతగా గుర్తింపు పొంది కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో ఆయన తన సీటును త్యాగం చేశారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ముందు కుదిరిన ఎన్నికల పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.సీపీఐ అభ్యర్థి కూడా నల్గొండ జిల్లా వ్యక్తికే. సీపీఐ ఆ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న నెల్లికంటి సత్యం శాసనమండలి లో అడుగు పెట్టడం లాంచనమే అయ్యింది. మునుగోడు మండలం ఎలగలగూడేనికి చెందినవారాయన. సీపీఐలో దిగువ స్థాయి నుంచి జిల్లా కార్యదర్శి వరకు ఎదిగారు. గత ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం కోసం పట్టుబట్టింది. అప్పుడు ఒప్పందం ప్రకారం సీపీఐ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆ పార్టీ మండలిలో అడుగు పెట్టనుంది.బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఏకైక అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్. ఆయన కూడా నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. విద్యార్థి దశ నుంచే ఆయన క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. దీంతో కారు పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు చూస్తుంటే నల్గొండ జిల్లాపై ప్రధాన పార్టీలు గురిపెట్టినట్టు కనిపిస్తోంది.