గుజరాత్ కమలానిదే…
గాంధీనగర్, ఏప్రిల్ 29, ( వాయిస్ టుడే )
Gujarat belongs to the Lotus.
గుజరాత్ లో బీజేపీ తన పట్టును నిలుపుకుంది. అక్కడ జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. 15 కార్పొరేషన్లూ బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో గుజరాత్ లో బీజేపీదే బలం అని మరోసారి రుజువు చేసినట్లైంది. ఇక.. కాంగ్రెస్, ఆప్ పత్తా లేకుండా పోయాయి. కనీసంలో కనీసం నామ మాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. మొత్తం 1,044 సీట్లుండే 15 మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ 856 సీట్లను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుంది. ఇక ఇతరులు 12 స్థానాల్లో విజయం సాధించారు.రాజ్‌కోట్‌లో బీజేపీ పనితీరు కూడా అత్యంత ఆకట్టుకునేలా సాగింది; మున్సిపల్ కార్పొరేషన్‌లోని 72 స్థానాలకు గాను ఆ పార్టీ 65 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ కేవలం 7 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ కనీసం తన ఖాతాను కూడా తెరవలేకపోయింది. ఇంతలో, రాజ్‌కోట్ జిల్లా పంచాయతీలోనూ బీజేపీ 36 స్థానాలకు గాను 34 స్థానాలను గెలుచుకుని ప్రతిపక్షాల ఉనికినే ప్రశ్నార్థకం చేసింది.ఇక.. అహ్మదాబాద్ లోని 192 స్థానాలకు గానూ బీజేపీ 158 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 22 స్థానాలను గెలుచుకుంది. సూరత్ లో 120 స్థానాలుంటే బీజేపీ 115 స్థానాల్లో గెలుపొందగా, ఆప్ 4 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ మాత్రం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది.రాజ్ కోట్, వడోదరా, భావ్ నగర్ లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. రాజ్ కోట్ లో 72 స్థానాలకు గాను బీజేపీ 65, కాంగ్రెస్ 7 స్థానాలను, వడోదరాలో 76 వార్డులకు గానూ బీజేపీ 69, కాంగ్రెస్ 6 వార్డుల్ని గెలుచుకుంది. భావ్ నగర్ లో మొత్తం 52 వార్డులుండగా.. బీజేపీ 44, కాంగ్రెస్ 8, ఆప్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. కర్మసాద్, ఆనంద్, గాంధీ ధామ్, నడియాడ్, నవసారి పట్టణాలను బీజేపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసుకొచ్చింది. పోర్ బందర్, మోర్బి, సురేంద్ర నగర్, మొహసానా, వాపి కార్పొరేషన్లను కూడా బీజేపీ గెలుచుకుంది.ఇక… పంచాయతీల్లో కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీని చూపించింది. ధోరాజి, జేత్‌పూర్, గోండల్, కోట్డా సంగని, లోధికా, పద్ధారి, జస్‌దన్, వింఛియా మరియు జమ్‌కండోర్నలతో సహా, చాలా వరకు పంచాయతీలలో బీజేపీ గెలిచింది. 34 పంచాయతీల్లో 1090 స్థానాలుంటే, బీజేపీ 568 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 77, ఇతరులు 30 స్థానాల్లో గెలిచారు. 260 తాలూకా పంచాయతీల్లో 5234 స్థానాలుంటే బీజేపీ 2397 స్థానాలను దక్కించుకుంది. అలాగే కాంగ్రెస్ 591, ఇతరులు 329 స్థానాలను గెలుచుకున్నారు.



