సీమను రతనాల సీమగా మార్చుతా: చంద్రబాబు నాయుడు
జమ్మలమడుగు: సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పర్యటించారు.
చంద్రాబాబు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టు ల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అన్ని జిల్లాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నందికొట్కూరుతో ప్రారంభించి, పాతపట్నంతో ముగింపు పలుకుతాను. జమ్మల మడుగు లో భూపేశ్ రెడ్డి బుల్లెట్ లా దూసుకుపోతున్నాడు. జమ్మలమడుగులో సైకిల్ రెపరెపలాడుతోంది. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలి. భూపేశ్ రెడ్డి మీకోసం పనిచేస్తున్నాడు. వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గమైన జమ్మలమడుగు తెలుగుదేశానికి కంచుకోట. దోచుకోవాలనే ఆరాటంతప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు.
జమ్మలమడుగులో ఒక్క ప్రాజెక్ట్ కట్టి, ఒక్క ఎకరాకైనా ఈ ముఖ్యమంత్రి నీళ్లిచ్చాడా? రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకోసం నేను ఐదేళ్లలో సీమలో రూ.12వేలకోట్లు ఖర్చుపెడితే, ఈయన సీఎం రూ.2వేలకోట్లు ఖర్చుపెట్టాడు. నేను రాయలసీమలోనే పుట్టాను. సీమను రతనాలసీమగా మార్చేబాధ్యత నాది, దోపిడీ రాజ్యాన్ని అంతంచేసి పేదల్ని ధనికుల్ని చేయాలన్నదే నా ఆలోచన. నేను ముందుచూపుతో ఆలోచిస్తాను.. ఈ ముఖ్యమంత్రివి అన్నీ అడ్డచూపులు.. దొంగచూపులే. మీ ప్రాంతంలో లభించే ఇసుక మీకు దొరకదు. ఇక్కడి ఇసుక బెంగుళూరు, చెన్నైకి తరలిపోతోంది. ఎలాంటి మద్యం అమ్ముతున్నారో చూస్తున్నారు కదా! మద్యం కొంటే బిల్లు ఇవ్వరు. నాసిరకం మందు అమ్మడంద్వారా వచ్చే కలెక్షన్ అంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతోందని అన్నారు.
రేపు జరిగే ఎన్నికల్లో మీ చేతిలోని ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించండి. మీ పిల్లల గురించి, రాష్ట్రం గురించి ఆలోచించండి. భూపేశ్ రెడ్డిని బలపరిచి, జమ్మలమడుగులో తెలుగుదేశంపార్టీని గెలిపించండి. మీరు చేయాల్సింది చేస్తే, నేను మీకు అండగా ఉంటాను. మహాశక్తి పథకంతో ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పాను. అలానే తమ్ముళ్లకు ఉద్యోగ, ఉపాధి కల్పించే బాధ్యత నాది, రైతుల్ని ఆదుకుంటాను. అందరికీ న్యాయం చేస్తాననని అన్నారు.