అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా,
Allu Arjun's bail plea hearing adjourned
తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
హైదరాబాద్, డిసెంబర్ 27
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న అల్లు అర్జున్ నేడు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ గడువు సైతం పూర్తి కావడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలిపారు. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ కోసం అల్లు అర్జున్ తరఫున ఆయన లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు ఈ పిటిషన్ విచారణ స్వీకరించింది. కోర్టులో విచారణ ప్రారంభం కాగా, కౌంటర్ ధాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దాంతో నాంపల్లి కోర్టు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
వర్చువల్‌గా విచారణకు హాజరైన అల్లు అర్జున్
అల్లు అర్జున్ నేరుగా కాకుండా వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. మొదట అల్లు అర్జున్ విచారణకు వస్తారని నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫున లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లగా, అల్లు అర్జున్ అభ్యర్థనను కోర్టు మన్నించింది. నాంపల్లి కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుందని విచారణ జరిపారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు విచారణనూ సైతం నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. జనవరి 10వ తేదీన తదుపరి విచారణను చేపట్టనున్నట్లు కోర్టు వెల్లడించింది. అల్లు అర్జున్ రిమాండ్ పై సైతం అదేరోజు విచారణ జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వం సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకుంది. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. థియేటర్ సంబంధిత వ్యక్తులు ఏ1 నుంచి ఏ10 వరకు ఉండగా, ఏ11గా హీరో అల్లు అర్జున్, చివరగా పుష్ప 2 నిర్మాతల్ని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ నెల 13న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్ విధించారు. అదే రోజు హైకోర్టును ఆశ్రయించగా అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి బన్నీ విడుదలయ్యారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించింది పుష్ప 2 మూవీ యూనిట్. మొదట మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.25 లక్షల చెక్కును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందించారు. అనంతరం అల్లు అర్జున్ రూ.1 కోటి రూపాయలు, పుష్ప 2 నిర్మాత, దర్శకుడు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఈ చెక్కులను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు పుష్ప 2 యూనిట్ అందించింది.