ఎన్ ఆర్ ఐలకు అమెరికా షాక్
హైదరాబాద్, మే 17, (వాయిస్ టుడే )
America's shock for NRIs
NRIలకు అమెరికా మరో బిగ్ షాక్ ఇవ్వబోతుంది. అమెరికా పార్లమెంటులో కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. రిపబ్లిక్ పార్టీ కొత్తగా ఒక పన్ను చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఇదే జరిగితే అమెరికాలోని లక్షలాది మంది భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బ.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరుతో కొత్త పన్ను చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. అమెరికాలో ఉన్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు పంపే నగదు బదిలీలపై 5 శాతం పన్ను విధించాలని ఆయన సూచించారు. ఈ కొత్త రెమిటెన్స్ పన్ను ప్రతిపాదన ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభలో బిల్లుగా ప్రవేశపెడతారు. ఇది అమల్లోకి వస్తే, అమెరికాలో పనిచేస్తున్న H-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డు కలిగినవారు, తాము పంపే డబ్బుపై 5 శాతం అదనపు భారం మోపాల్సి వస్తుంది.రియల్ ఎస్టేట్, విద్య, వైద్య ఖర్చుల కోసం తమ దేశానికి డబ్బు పంపే డబ్బులపై భారీగా భారం పడనుంది. అమెరికాలో ఉన్న భారతీయులు.. స్వదేశంలో ఉన్న తమ వారికి 11వందల 60 డాలర్లు అనగా దాదాపు రూ.లక్ష పంపిస్తే, అందులో ఐదు శాతం.. రూ.5వేలను పన్నుగా చెల్లించాలి. హెచ్-1బీ, ఎఫ్-1 లేదా జే-1 వీసాదారులు, గ్రీన్ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేనివారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే..! అమెరికా పార్లమెంటులో సమర్పించబోయే ఈ కొత్త బిల్లు 389 పేజీల పొడవు ఉంది. పేజీ నంబర్ 327లో ఒక లైన్ రాసి ఉంది. అమెరికా పౌరుడు కాకపోతే, US వెలుపలకు పంపిన డబ్బుపై 5 శాతం పన్ను విధించడం జరుగుతుంది.ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం, రెమిటెన్స్ రూపంలో అత్యధికంగా ఆదాయం పొందే దేశంగా భారత్ 2008 నుంచి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది ప్రపంచ మొత్తం రెమిటెన్స్‌లలో 14 శాతం భారత్‌కు వచ్చిందని అంచనా. అమెరికా ప్రభుత్వ నిర్ణయం, లక్షలాది మంది భారతీయ ప్రవాసులకు ఆర్థికంగా కొత్త భారంగా మారే అవకాశముంది.ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అమెరికాలో దాదాపు 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది H-1B లేదా L-1 వీసాపై, గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు. ఈ వ్యక్తులు ప్రతి నెలా ఇంటికి డబ్బు పంపుతారు. కొన్నిసార్లు వారి తల్లిదండ్రుల మందుల కోసం, కొన్నిసార్లు వారి సోదరి, సోదరుల చదువు కోసం, కొన్నిసార్లు ఎవరికైనా వివాహానికి సహాయం చేయడానికి.. ఇలా పంపించే వాటన్నింటిపై ట్రంప్ ప్రభుత్వం పన్ను విధించబోతోంది.2023-24 సంవత్సరంలో, భారతదేశం అమెరికా నుండి 32 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ను అందుకుంది. దీనిపై మనం 5% పన్ను విధిస్తే, భారతీయులు ఏటా దాదాపు 1.6 బిలియన్ డాలర్ల అదనపు భారాన్ని మోయవలసి ఉంటుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు రూ. 5,000 లేదా రూ. 5 లక్షలు పంపినా, ప్రతి బదిలీపై ఈ పన్ను విధించడం జరుగుతుంది. మే 26 నాటికి అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 4 (అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం) నాటికి దీనిని చట్టంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అంటే, అది ఆమోదం పొందితే, జూలై నుండే డబ్బు పంపడంపై 5% పన్ను ప్రారంభమవుతుంది