అంగన్‌వాడీ కేంద్రాలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు: మంత్రి సీతక్క
Anganwadi centers are strong foundations for children’s future: Minister Seethakka
హైదరాబాద్, జూన్ 15 (వాయిస్ టుడే): చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్తో కలిసి చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, ప్రీ-స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసి, ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధృవపత్రాలను అందజేశారు. అనంతరం చిన్నారులతో కలిసి అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని, అభ్యాసన పుస్తకాలు, ఆటవస్తువులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలు కేవలం పోషకాహార కేంద్రాలుగా కాకుండా చిన్నారుల తొలి విద్యాలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను సమగ్రంగా అందిస్తూ చిన్నారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
ప్రతి చిన్నారి అంగన్‌వాడీలో చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించిన మంత్రి, “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన, నమ్మకం పెంపొందిస్తున్నామని చెప్పారు. గతంలో లేని విధంగా ప్రతి చిన్నారికి రెండు జతల యూనిఫాంలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి మంచి స్పందన లభించడంతో దానిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. చిన్నారుల కోసం 57 రకాల విద్యా, ఆటవస్తువులు, ఎర్లీ చైల్డ్ కేర్ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారు 9 లక్షల మంది చిన్నారులు నమోదయ్యారని, వారి ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి పేర్కొన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఖిచిడీ, ఎగ్ బిర్యానీ వంటి పోషకాహారాన్ని అందిస్తున్నామని, అంగన్‌వాడీ టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని చెప్పారు.
రాష్ట్రంలో 38 వేల అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని, సిబ్బంది సంక్షేమం కోసం నెలన్నర సెలవులను కూడా మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. “లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం లేదు. మీ పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించండి. నాణ్యమైన విద్య, పోషకాహారం, ఉత్తమ వాతావరణాన్ని అందిస్తాం” అని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం మంత్రి సీతక్క అవగాహన ర్యాలీని ప్రారంభించి, “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట”, “ప్రైవేట్ నర్సరీ వద్దు.. అంగన్‌వాడీ ముద్దు” అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, జాయింట్ డైరెక్టర్ మోతి, గోల్కొండ ప్రాజెక్టు సీడీపీఓ రేణుక, శాఖ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులను, అంగన్‌వాడీ సిబ్బందిని మంత్రి అభినందించారు.




