మున్నూరు కాపు భవనానికి మరో రూ.5 కోట్లు!

- Advertisement -

మున్నూరు కాపు భవనానికి మరో రూ.5 కోట్లు!

త్వరగా నిర్మాణాలు చేపట్టాలి.. అదనపు నిధులు కేటాయిస్తాం: మంత్రి పొన్నం

యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధిపై ప్రత్యేక కార్యాచరణ
సంపన్నులు పేదల విద్య, ఉద్యోగాభివృద్ధికి తోడ్పడాలి.. కులస్తులూ విరాళాలు అందించాలి: ఆది శ్రీనివాస్‌

Another Rs 5 crore for the Munnuru Kapu Bhavan!

Another Rs 5 crore for the Munnuru Kapu Bhavan!
Another Rs 5 crore for the Munnuru Kapu Bhavan!

హైదరాబాద్‌, అక్టోబరు 29 (వాయిస్‌ టుడే):

కోకాపేటలో నిర్మించనున్న మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.5 కోట్లు కేటాయించిందని, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభిస్తే మరో రూ.5 కోట్లు మంజూరు చేస్తామని బీసీ సంక్షేమ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల్లో సంపన్నులుగా ఎదిగిన వారు కుల భవనాల నిర్మాణంతో పాటు పేదల విద్య, ఉద్యోగాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం గురువారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీ క్లబ్‌లో నిర్వహించారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా హాజరై నిధుల కేటాయింపునకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులంలో ఐక్యతతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలని అన్నారు. ఉన్నత స్థాయికి చేరుకున్నవారు తమ సామాజిక వర్గంలోని పేద విద్యార్థులు, నిరుద్యోగుల అభ్యున్నతికి తోడ్పడాలని సూచించారు. మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని, పనుల పురోగతిని బట్టి అదనంగా మరో రూ.5 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. అదనపు నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.

కులవృత్తుల్లో కాలానుగుణ మార్పులు రావాలి

మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తుల్లోనూ మార్పులు రావాలని, యువత ఆధునిక నైపుణ్యాలను అలవర్చుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌ ద్వారా యువతకు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. స్వయం ఉపాధి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. త్వరలో ప్రారంభం కానున్న రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో కులగణన నిర్వహించామని, జనాభాకు సంబంధించిన ప్రామాణిక గణాంకాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కులగణన నివేదిక ఆధారంగా సామాజిక పరిస్థితులను విశ్లేషించి అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన కుటుంబాలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. గుజరాత్‌లోని పాటిదార్‌ భవన్‌లో యువతకు నాణ్యమైన శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విధానాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో బీసీ స్టడీ సర్కిళ్లలోనూ సంస్కరణలు చేపడుతున్నామని, మున్నూరు కాపు విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో యువతకు విద్యే కీలక పెట్టుబడి అని పేర్కొన్నారు.

నిర్మాణానికి కులబాంధవులూ సహకరించాలి

ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మున్నూరు కాపు కుల పెద్దలంతా ఐక్యంగా ఉండి ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు కులబాంధవులు కూడా విరాళాలు అందించి నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ఆత్మగౌరవ భవనానికి రూ.20 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ బాలలక్ష్మి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, మాజీ ఆర్టీసీ చైర్మన్‌ సోమవారం సత్యనారాయణ, డాక్టర్‌ పుంజాల వినయ్‌కుమార్‌, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తమరావు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు గాలి అనిల్‌కుమార్‌, రౌతు కనకయ్య, మంగళారపు లక్ష్మణ్‌, సత్తు మల్లేశం, గ్లోబల్‌ మున్నూరు కాపు అడ్వైజర్‌ సంఘాని రజనీకాంత్‌, బుక్క వేణుగోపాల్‌, జె.ఎన్‌. వెంకట్‌, మిద్దెల జితేందర్‌, మణికొండ వెంకటేశ్వరరావు, ఎడ్ల రవి, బండి పద్మ, ఈసంపల్లి వెంకన్న, కె.ఎస్‌. ఆనంద్‌ తదితరులు, వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular