కొనసాగుతున్న ఎన్నికల కసరత్తు
అక్టోబరు 4న తుది జాబితా

హైదరాబాద్, ఆగస్టు 30: తెలంగాణలో ఎన్నికల కసరత్తు మొదలైంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతుండటంతో… రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఏర్పాట్లకు రెడీ అయ్యింది. శాసనసభ ఎన్నికల కోసం అధికారులు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్… అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డీజీపీతో ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలింగ్ నిర్వహణ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ ఏడాది ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వికాస్‌రాజ్ తెలిపారు. అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారాయన. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తయిందని.. జిల్లాల్లోనూ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితాపై దృష్టిపెట్టిన ఎన్నికల సంఘం… ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దొంగఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓటర్లను తొలగించినట్లు సీఈవో వికాజ్‌రాజ్ తెలిపారు. ఇందులో సగానికిపైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నట్టు చెప్పారు. ఓటర్ల జాబితాలో సవరణకు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్. మార్పులు, చేర్పుల కోసం 9 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు పది రోజుల ముందువరకు… ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడంతో.. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై సెప్టెంబరు 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని.. అక్టోబరు 4వ తేదీన తుది ఓటర్ల జాబితాప్రకటిస్తామన్నారు. ఒకే వ్యక్తికి రెండు.. అంతకు మించి ఓట్లు ఉండడం, డూప్లికేట్ ఎంట్రీలు వంటి బోగస్ ఓట్లు తొలగించినట్లు తెలిపారు. అలాగే ఫాం-8 ద్వారా అడ్రస్ మార్చుకున్నప్పుడు పాత అడ్రెస్‌లో ఉన్న పేర్లను తొలగిస్తామన్నారు. అలాగే, ఓటరు నమోదు చేసిన చిరునామాలో నివసించనట్లు తెలిస్తే ఓటు డిలీట్ అవుతుందని చెప్పారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై విధివిధానాలు పాటించాలన్నారు సీఈవో వికాస్‌రాజ్. ఓటర్ల దగ్గర నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేలా ప్రయత్నించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గిందని.. ఈసారి అలా జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఓటింగ్ పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తొలిసారి ఓట్లు నమోదు చేసుకునే వారి సంఖ్య ఈసారి భారీగా నమోదైందని చెప్పారు. ఓటర్ల సంఖ్య పెరగడంతో పోలింగ్ కేంద్రాలు కూడా భారీగా పెరుగుతున్నాయన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 15 వందల మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చూస్తున్నామని చెప్పారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే పరిస్థితి రాకుండా… కసరత్తు చేస్తున్నామన్నారు.

ఓటర్లు చెక్ చేసుకొనే అవకాశం
తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, లోక్‌సభ ఎన్నికలకు కూడా కొన్ని నెలల సమయమే ఉంది. దీంతో ఓటర్ల జాబితా తుది మెరుగులు దిద్దుకుంటోంది. కనుక త్వరపడండి… ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే తెలుసుకోండి. ఓటు ఉంటేనే ఒక పౌరుడిగా మీ నాయకుడిని ఎన్నుకోగలరు. ఓటు లేకపోతే.. మళ్లీ నమోదు చేయించుకోండి. అది ఎలా అంటారా…? దానికి ఎన్నో మార్గాలు కల్పించింది ఎన్నికల కమిషన్ https://ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో వెళ్తే.. పై భాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. అసెంబ్లీ నియోజకవర్గాల విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్‌లో ఉంటాయి. మీరు ఉంటున్న ఏరియా… ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తుందో చూసుకుని, ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి అందులో మీ పేరు ఉందా? లేదా చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోనే సెర్చ్ యువర్ నేమ్ అనే సబ్ కేటగిరీ కూడా ఉంటుంది.
ఇక, ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ ద్వారా… ఓటరు లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. http//voterportal.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఎలక్టోరల్ కాలంపై క్లిక్ చేసి.. ఫోటో గుర్తింపు కార్డుపై ఉన్న నెంబర్ ఎంటర్ చేస్తే… జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుస్తోంది. ఈ పేరు ఉంటే.. ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది… సీరియల్ నంబర్ ఎంత.. లాంటి వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ, మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ తెలియకపోతే.. అడ్వాన్స్ సెర్చ్ కాలంలోకి వెళ్లి… మీ పేరు, మీ తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలను ఎంటర్ చేయడం ద్వారా కూడా ఓటరు లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఈ రెండూ కాక… మరో మార్గం కూడా ఉంది. NVSP వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు. www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే కేటగిరీ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే.. సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే రెండు సబ్ కేటగిరీలు కనిపిస్తాయి. అక్కడ మీపేరు, మీ తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం తదితర వివరాలను ఎంటర్ చేసి లేదా ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను ఎంటర్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. గూగుల్‌ప్లే స్టోర్‌లోనూ భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ఉంటుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. యాప్ ఓపెన్ చేయగానే… పైభాగంలో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే కాలం కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే సెర్చ్ బై బార్ కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే నాలుగు విభాగాలు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండు విభాగాలకు సంబంధించి మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే మీ పేరు, మీ తండ్రి పేరు, వయస్సు, జిల్లా, నియోజకవర్గం వంటి వివరాలను ఇవ్వడం ద్వారా లేదా ఫోటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య ఎంటర్ చేయడం ద్వారా కూడా జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవచ్చు. మీ ఓటు లేకపోతే మాత్రం.. కొత్తగా ఎల్‌రోల్ చేయించుకోండి. ఇందుకోసం… www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగా మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. రిజిస్టర్ యాజ్ ఏ న్యూ ఓటర్ అని ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫారం-6 అప్లికేషన్ ఫామ్ ఫర్ న్యూ ఓటర్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆన్‌లైన్ దరఖాస్తు వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నింటినీ నింపి సబ్‌మిట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నంబర్‌కు రిఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుంది. ఆన్‌లైన్ చేసుకున్న దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్‌స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేస్తారు. పోలింగ్ కేంద్రాల ద్వారా కూడా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ స్థాయి అధికారి అంటే బీఎల్‌ఓ ఉంటారు. వారి దగ్గర పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటరు జాబితా ఉంటుంది. ఆ జాబితా పరిశీలించి మీ ఓటు ఉందో..లేదా? కూడా చూసుకోవచ్చు. అంతేకాదు… ప్రతి నియోజకవర్గానికి డివిజన్ స్థాయి అధికారిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా, ప్రతి మండలంలోనూ తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించింది ఎన్నికల సంఘం. వారి కార్యాలయాలకు వెళ్లి కూడా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారు విచారణ జరిపి ఓటు హక్కు కల్పిస్తారు



