Sunday, September 8, 2024

మెదక్ సీట్ కోసం ఆశావహులు

- Advertisement -

త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ… వచ్చే ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించాలనే కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు సిట్టింగ్‌ స్థానంలో పాగా వేయాలని ఆలోచనలో గులాబీ పార్టీ ఉంది. ఇక కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉన్న భాజపా సైతం గెలుపుపై ఆశలు పెట్టుకుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే యోచనలో ఉన్నాయి. ఇందుకు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల నుంచి ఆశావహులు పెద్దసంఖ్యలో ప్రయత్నాలు ప్రారంభించారు.

రాజకీయ పార్టీల సన్నద్ధం..

లోక్‌సభ ఎన్నికల పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ క్యాడర్‌ను సన్నద్ధం చేస్తున్నాయి. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మెదక్‌, నర్సాపూర్‌, సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో భారాస గెలుపొందింది. మెదక్‌లో మాత్రం కాంగ్రెస్‌ విజయం సాధించింది.

హస్తంలో పోటీ ఎక్కువ..

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ స్థానంలో ఈసారి ఎలాగైనా గెలుపొందాలనే ధీమాతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. మెదక్‌ స్థానానికి 11 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి, నేతలు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, మద్దుల సోమేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు అర్జీ పెట్టుకున్నారు. వీరితో పాటు మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్‌ జిల్లాలో ఆయా పార్టీల నేతలతో పరిచయాలు ఉండడంతో ఇతర పార్టీల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు హన్మంతరావు పావులు కదుపుతున్నారు.

క్యాడర్‌ అభిప్రాయంతో…

గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడ్డ కాషాయ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో దింపాలనే యోచనలో ఉంది. సమావేశాలను నిర్వహిస్తూ క్యాడర్‌ అభిప్రాయాలను తీసుకుంది. పార్టీ ఆఫీసు బేరర్లు నేతలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు అధిష్ఠానానికి నివేదిక అందజేసినట్టు సమాచారం. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, ఆకుల రాజయ్య, సంగారెడ్డికి చెందిన నరేందర్‌రెడ్డి టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు.

గులాబీ దళపతిదే తుది నిర్ణయం

సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే యోచనలో గులాబీ పార్టీ ఉంది. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ స్థానం నుంచి నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి, సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, పటాన్‌చెరుకు చెందిన గాలి అనిల్‌కుమార్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. తనకు టికెట్‌ కేటాయించాలని సంగారెడ్డికి చెందిన బీరయ్యయాదవ్‌ కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి మెదక్‌ ఎంపీ టికెట్‌ ఇస్తామని అప్పట్లో పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చింది. మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు సైతం వినిపిస్తోంది. 2009 నుంచి వరుసగా మూడుసార్లు ఈ స్థానం నుంచి గెలుపొందిన భారాస(నాటి తెరాస) ఈసారి కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. సొంత జిల్లా కావడంతో అభ్యర్థి ఎంపిక విషయంలో గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్