అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..!!
Assembly special meeting..!!
హైదరాబాద్
హైదరాబాద్ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఒక్క రోజు చర్చ
15 నుంచి బడ్జెట్ సమావేశాలు
17న రాష్ట్ర బడ్జెట్‌కు అవకాశం
ఒకట్రెండు రోజులు అటు ఇటుగాపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
మంగళవారం శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యులు తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ ధ్రువీకరించారని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా లేఖలు పంపినట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తదితర అంశాలపై నిర్వహించనున్న ఈ ప్రత్యేక సమావేశాలను ఒక్క రోజులోనే ముగించనున్నారు.
17న రాష్ట్ర బడ్జెట్:
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 15 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అనంతరం 17న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఒకట్రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించి, సభను వాయిదా వేస్తారని, పద్దుల పై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వంటివాటిని మార్చి రెండో వారంలో చేపడతారని తెలిసింది.
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందని చెప్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇదే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ఒక రోజు ముందుగాని, వెనుక గాని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.