హైదరాబాద్, జూలై 27, (వాయిస్ టుడే): యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ల ‘బేబీ’ తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ చిత్రం కేవలం 11 రోజుల్లో దాదాపు 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ‘బేబీ’.. విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. దీంతో అన్న విజయ్ దేవరకొండను ఆనంద్ మించిపోయాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.జూలై 14న థియేటర్లలో విడుదలైన ‘బేబీ’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.
దీంతో ‘బేబీ’ తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. అంతే కాదు ఆనంద్ దేవరకొండ కెరీర్‌లో 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ‘బేబీ’ ఒకటి కావడం మరో చెప్పుకోదగిన విషయం. ఈ సక్సెస్ పై మాట్లాడిన నిర్మాత ఎస్‌కెఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు)..‘‘మా కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘బేబీ’కి అపారమైన ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు. వర్షంలో కూడా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం అరుదైన విషయం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది” అని చెప్పారు. “నేను గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రాన్ని నిర్మించాను. అది సూపర్ హిట్ అయింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో అన్నదమ్ములిద్దరికీ బ్లాక్‌బస్టర్స్ అందించడం ఆనందంగా ఉంది” అని ఆయన ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.సాయి రాజేష్ నీలం రచన, దర్శకత్వలో తెరకెక్కిన ‘బేబీ’లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తో పాటు నాగేంద్రబాబు, లిరీషా కునపరెడ్డి, హర్ష చెముడు, సాత్విక్ ఆనంద్, కుసుమ డేగలమారి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోన్న ‘బేబీ’.. ఓటీటీపైనా మేకర్స్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులను నిరాశ పర్చే న్యూస్ చెప్పారు. బేబీని ఆగస్టు చివరివారంలో లేదా.. సెప్టెంబర్ మెుదటి వారంలో విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆగస్టులోనే విడుదల కానుందని సమాచారం. ఆగస్టు 18 నుంచి ఆహా ఓటీటీలో ‘బేబీ’ సినిమా స్ట్రీమింగ్ అవనుందని కన్ఫామ్ అయింది. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సుమారు రూ.10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం.. ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది. రూ.60 కోట్లపైనే గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో తీసినా… కథ బాగుంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది ఈ చిత్రం. కానీ ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.