Sunday, September 8, 2024

బర్రెలక్క… ఓటు ఎవరికి చేటు…

- Advertisement -

మహబూబ్ నగర్, నవంబర్ 29, (వాయిస్ టుడే):  బర్రెలక్క.. అలియాస్ శిరీష. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిరేపుతున్న పేరు. నిరుద్యోగ సమస్యే ప్రధాన అజెండాగా అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టిన బర్రెలక్క.. ఇప్పుడు విపక్ష కాంగ్రెస్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. కొల్లాపూర్ నుంచి బరిలో దిగిన బర్రెలక్క.. ఇప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజీగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. దీంతో బర్రెలక్క పేరు వింటేనే కాంగ్రెస్‌ నేతలు కంగారెత్తిపోతున్నారట?బర్రెలక్క.. బర్రెలక్క.. బర్రెలక్క.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్న పేరు. అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనంగా మారిన పేరు. కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీష అలియాస్‌ బర్రెలక్క రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిరుద్యోగ సమస్యపై చిన్నవీడియో తీసి.. అది బాగా వైరల్‌ కావడంతో ఫేమస్‌ అయిన బర్రెలక్క కొల్లాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో మరింత ఫేమస్‌ అయ్యారు. ఇక ఆమెను.. ఆమె కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారనే ప్రచారం.. హైకోర్టు జోక్యంతో భద్రత కల్పించడంతో ఇంకాఇంకా ఫేమస్‌ అయిపోయారు బర్రెలక్క. అంతేకాదు ఆమెకు ఎన్నికల ఖర్చు కోసం జనమే విరివిగా విరాళాలివ్వడంతో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య వంటి ప్రముఖులతోపాటు న్యాయవాదులు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రచారానికి స్వచ్ఛందంగా రావడంతో ఈ ఎన్నికల్లో పొలిటికల్‌ స్టార్‌గా మారిపోయారు బర్రెలక్క.తన వీడియో వైరల్‌ అయిన తర్వాత, ఎన్నికల్లో పోటీ చేస్తానని బర్రెలక్క సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినంతవరకు ఆమెపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ, నామినేషన్ల ఉపసంహరణ, ఆ తర్వాత జరిగిన దాడి ఎపిసోడ్‌తో మొత్తం సీన్‌ మారిపోయింది. ప్రధాన పోటీదారులైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులతో సమానంగా క్రేజ్‌ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఆమె చీల్చబోయే ఓట్లు గెలుపు గుర్రాల జాతకాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. బర్రెలక్క గెలుస్తుందా? లేదా? గెలిచే వారి జాతకం తలకిందులు చేస్తుందా.. అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారిపోయింది. బర్రెలక్క పోటీ చేస్తున్న కొల్లాపూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. 1952లో కొల్లాపూర్‌ నియోజకవర్గం ఏర్పడితే ఇప్పటివరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకంగా తొమ్మిది సార్లు కాంగ్రెస్‌ పార్టీయే జయకేతనం ఎగురవేసింది. అధికార బీఆర్‌ఎస్‌ రెండు సార్లు, ఇండిపెండెంట్లు మూడుసార్లు, తెలుగుదేశం పార్టీ ఒకసారి గెలిచింది. 2012 ఉప ఎన్నికల్లోనూ 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఈ ఎన్నికల్లో నిలిపింది.ఇక ఈసారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు 1999 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2018లో తొలిసారిగా ఓడిపోయిన జూపల్లి.. ఈ ఎన్నికల ముందే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కొల్లాపూర్‌ నియోజకవర్గ చరిత్ర పరిశీలిస్తే ఇక్కడ కాంగ్రెస్‌పార్టీకి స్ట్రాంగ్‌ క్యాడర్‌తోపాటు, మంచి హోల్డ్‌ ఉన్న విషయం తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలుస్తామని గట్టి నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీకి.. బర్రెలక్క కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. నియోజకవర్గంలో గట్టి క్యాడర్‌తోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఈజీగా గెలుస్తామని అంచనా వేసిన కాంగ్రెస్‌ పార్టీకి బర్రెలక్క రూపంలో గట్టి సవాల్‌ ఎదురవుతోంది.నిరుద్యోగ సమస్యలపై పోరాటం.. ప్రభుత్వాధినేతలకు నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో బర్రెలక్క పోటీకి దిగితే అధికార పార్టీకి నష్టం జరుగుతుందని అంతా ఊహించారు. కానీ, నాటకీయ పరిణామాలతో బర్రెలక్కకు విస్తృత ప్రచారం లభించడంతోపాటు నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు ప్రచారంలో హోరెత్తిస్తుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బర్రెలక్క భారీగా చీల్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది కాంగ్రెస్. బర్రెలక్క సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తన పోరాటాన్ని మొదలు పెట్టినా.. ఇప్పుడు అదే అధికార బీఆర్ఎస్‌కు అడ్వాంటేజీగా మారనుందనే టాక్ నడుస్తోంది. బర్రెలక్క ఇప్పుడు చీల్చబోయే ఓటన్నీ విపక్షాలవే అన్న చర్చ సాగుతోంది. ఇదే సమయంలో బర్రెలక్క తండ్రి విడుదల చేసిన వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటిదాకా బర్రెలక్క వీడియోలతో షేక్ చేస్తే.. ఇప్పుడు ఆమెను తప్పుపడుతూ ఆమె తండ్రే వీడియో రిలీజ్ చేయడం కలకలం రేపుతోంది. బర్రెలు లేని శిరీష.. బర్రెలక్కగా వీడియోలు తీస్తూ ప్రజలను మోసం చేస్తుందంటూ ఆమె తండ్రి విడుదల చేసిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.బర్రెలక్క ఎంట్రీతో కొల్లాపూర్‌ రాజకీయమే పూర్తిగా మారిపోగా.. ఇప్పుడు ఆమె తండ్రి విడుదల చేసిన వీడియో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. నిరుద్యోగుల ప్రతినిధిగా బర్రెలక్క చేస్తున్న పోరాటానికి విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి మద్దతు లభిస్తుండగా, ఆమెను నిలువరించే వ్యూహం ఏంటో తెలియక ప్రధాన పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. బర్రెలక్క పోటీపై భీఆర్‌ఎస్ ఎక్కడా నోరువిప్పడం లేదు. అయితే లోలోన తనకు మేలు జరుగుతుందనే విశ్లేషణలతో తెగ సంబరపడుతున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జూపల్లికి బీజేపీ చీల్చిన ఓట్లతో పరాభవం ఎదురైంది. ప్రస్తుతం ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి పోటీచేస్తూ రేసులో ముందున్న జూపల్లికి బర్రెలక్క రూపంలో సవాల్‌ ఎదురవుతోంది. ఈ సవాల్‌ను జూపల్లి ఎలా అధిగమిస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్