అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి
Benefit of Welfare Schemes to all who are eligible
ఘనంగా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల జనవరి 04
రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ది చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఫాతిమా, డిఇఓ జనార్దన్ రెడ్డి, జాతీయ అంధుల సంస్థ అధ్యక్షులు అనిల్, సుబ్రహ్మణ్యం, పుష్పరాజు, జనరల్ సెక్రెటరీ మహేశ్వర్ రెడ్డి, విజువల్లి చాలెంజ్డ్ ఎంప్లాయ్ ప్రెసిడెంట్ ఓబులేష్, వీరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల లబ్దిని చేకూరుస్తోందన్నారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను అప్డేట్ చేసుకుంటూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలని విభిన్న ప్రతిభావంతులను సూచించారు. 217 సంవత్సరాల తర్వాత కూడా ఫ్రాన్స్ లో జన్మించిన లూయిస్ బ్రెయిలీని స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించుకుంటున్నామని అలాంటి మహనీయ వ్యక్తులు స్ఫూర్తిగా తీసుకొని మసులుకోవాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు మనసున్న పెద్ద వాళ్ళని… కల్మషం లేని వ్యక్తులని ఒకటి లోటున్నా ఇంకొక ప్రతిభ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తారని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి తమలో ఉండాలని కలెక్టర్ అన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద సబ్సిడీ రుణాలు, చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ముద్రా రుణాలు, విశ్వకర్మ యోజన పథకం కింద యూనిట్ల మంజూరుకు సంబంధించిన రుణాలన్నీ అర్హులైన వాళ్లందరికీ మంజూరు చేస్తామన్నారు.
అంధత్వంతో ఉన్న వ్యక్తులకు పునాది అయిన లిపిని మర్చిపోకుండా నిరంతరాయంగా కొనసాగిస్తూ సామర్థ్యం కలిగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. బోగస్ పెన్షన్ తీసుకుంటున్నట్లు సభ్యులు లేవెత్తిన లేవనెత్తిన అంశాలపై కలెక్టర్ ప్రస్తావిస్తూ రీ వెరిఫికేషన్ నిర్వహించి అనర్హులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శారీరక వైకల్యం 40 శాతం పైబడి ఉన్న విభిన్న ప్రతిభావంతులకు మెడికల్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. అర్హత కలిగిన వ్యక్తులకు అంత్యోదయ, అన్న యోజన కార్డుల మంజూరుపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అర్హత గల విభిన్న ప్రతిభావంతులకు రెండు సెంట్ల స్థలాన్ని కూడా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 11వేల టిట్కో గృహాలు వున్నాయని విభిన్న ప్రతిభావంతులకు క్రింది పోర్షన్ లో ప్లాట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ గా తాను వచ్చిన తొలి రోజుల్లోనే విభిన్న ప్రతిభావంతులు అధికారులను కలిసేందుకు అవసరమైన రాంపు, రైలింగ్, వీల్ చైర్స్ ఏర్పాటు చేశామన్నారు.