21.2 C
New York
Thursday, May 30, 2024

జగన్ కోసం రంగంలోకి భారతి

- Advertisement -

జగన్ కోసం రంగంలోకి భారతి
కడప, ఏప్రిల్ 26
వైసీపీకి ఇప్పుడు జగన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్. గత ఎన్నికల మాదిరిగా సినీ నటులు లేరు. కుటుంబ సభ్యులు అంతకంటే కనిపించడం లేదు. అందుకే జగన్ ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఒక్కరే ప్రచార బాధ్యతలను చూస్తున్నారు. జగన్ కు అంతకుమించి అవకాశం కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ ఎన్నికలు గతం కంటే భిన్నం. గత ఎన్నికలకు ముందు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్. కానీ ఈసారి అటువంటి యాత్రలకు అవకాశం లేదు. పోనీ తన తరుపున చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ కూడా ఇప్పుడు లేరు. అందుకే ఈసారి జగన్ బలమైన నిర్ణయానికి వచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా జగన్ పర్యటనలు చేయాల్సి ఉండడంతో.. పులివెందుల బాధ్యతను సతీమణి వైయస్ భారతికి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పులివెందులలో జగన్ ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి హాజరైన భారతి వారం రోజుల పాటు పులివెందులలో ఉండి ప్రచారం చేయనున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ షర్మిల తో పాటు సునీత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో పులివెందుల ప్రచార బాధ్యతలు తీసుకుంటున్న భారతి ఎలా రిప్లై ఇస్తారో చూడాలి. అయితే ఆమె పార్టీ శ్రేణులతో సమన్వయానికే పరిమితం అవుతారన్న టాక్ కూడా ఉంది.గత ఎన్నికల్లో భారతి ప్రచారం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తగా కూడా రాణిస్తున్నారు. సొంత మీడియా బాధ్యతలను ఆమె చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె తాడేపల్లి లోనే ఉంటూ జగన్ బాగోగులు చూసుకుంటున్నారు. పులివెందులలో ఇప్పటికే జగన్ తరుపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు జగన్ నామినేషన్ దాఖలు చేయడంతో పాటు సభలో పాల్గొనడం ద్వారా మలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు అయింది. మరోవైపు జగన్ సతీమణి భారతి పులివెందులలో వారం రోజులు పాటు ఇంటింటా ప్రచారం చేయనున్నారు. కాగా పులివెందుల సభలో జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తున్నారని జగన్ గుర్తు చేశారు. అది నిజమేనని.. మంచి చేయడం మన కల్చర్.. మంచి మనసు మన కల్చర్.. మాట తప్పకపోవడం మన కల్చర్.. బెదిరింపులకు లొంగక పోవడం మన కల్చర్ అంటూ జగన్ చెప్పుకొచ్చారు. పులివెందులను ఈ రాష్ట్రం పువ్వుల్లో పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఒక వైయస్సార్, ఒక జగన్ ను ఈ రాష్ట్ర ప్రజానీకం అభిమానించిన విషయాన్ని ప్రస్తావించారు.జగన్ తన సోదరి షర్మిలకు ఇచ్చి పడేశారు. ఆమె పేరు ప్రస్తావించకుండానే విమర్శనాస్త్రాలు సంధించారు. రాజశేఖర్ రెడ్డి మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన.. ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని.. వారి ఇళ్లకు వెళ్లి.. వారికి మోకరిల్లి.. వారి కుట్రలో భాగమై.. వారి స్క్రిప్టులను చదివి వినిపిస్తున్న వీరా వైయస్సార్ అభిమానులు అంటూ షర్మిలపై తీవ్రస్థాయిలో జగన్ విరుచుకుపడ్డారు. పనిలో పనిగా బాబాయ్ వివేక హత్య కేసు గురించి కూడా ప్రస్తావించారు. వివేకాకు రెండో వివాహం, సంతానం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ వెళ్ళాడో గుర్తించాలన్నారు. వైయస్సార్ ఎవరి మీద పోరాటం చేశారో.. వారితోనే తన చెల్లెళ్లు చేతులు కలిపారని.. అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అని జగన్ వెనుకేసుకు రావడం విశేషం.జగన్కు మద్దతుగా గత ఎన్నికల్లో పులివెందులలో భారతీ ఇంటింటా ప్రచారం చేశారు. అప్పట్లో ప్రజలను ఆకట్టుకోవడంలో భారతి సక్సెస్ అయ్యారు. అందుకే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా భారతితో పర్యటనలు చేయించాలని జగన్ భావించారు. కానీ ఇప్పుడు కడపలో సొంత కుటుంబ సభ్యులే తనకు వ్యతిరేకంగా మారడంతో.. భారతిని అక్కడే ప్రయోగిస్తే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే వారం రోజులపాటు భారతి పులివెందులలో పార్టీ శ్రేణులతో ప్రచారం చేస్తారు. పార్టీని సమన్వయం చేసుకుంటారని పార్టీ వర్గాలు చేస్తున్నాయి. అయితే షర్మిల, సునీతలపై విరుచుకు పడతారా? కేవలం ఇంటింటా ప్రచారానికి పరిమితం అవుతారా? అన్నది చూడాలి

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!