విశాఖపట్టణం, నవంబర్ 14, (వాయిస్ టుడే ): క్రికెట్ ప్రపంచమంతా ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గత ప్రపంకప్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సెమీస్ మ్యాచ్‌కు ఏపీలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని భారీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఏసీఏ ప్రతినిధులు తెలిపారు. ఒక్కో చోట సుమారు 10వేల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్క్రీన్లపై మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు. హైదరాబాద్‌లోనూ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లు, ఐటీ కంపెనీలు మ్యాచ్‌ను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే పిచ్..మ్యాచ్ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు దాదాపుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. గత ప్రపంచకప్ మ్యాచుల్లోనూ వాంఖడే పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ దక్షిణాఫ్రికా రెండు సార్లు భారీ స్కోర్లు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఏడు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌పై కూడా ఎనిమిది వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఈ రెండు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసి దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు నమోదు చేయడమే కాకుకుండా ఘన విజయాలు కూడా సాధించింది.అనంతరం శ్రీలంకపై టీమ్‌ఇండియా కూడా 357 పరుగులు చేసింది. లంక బౌలర్లను ఊచకోత కోసింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు లంకేయులను 55 పరుగులకే కుప్పకూల్చి ఘన విజయం సాధించారు. ఇక ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం విజయం ముంగిట అఫ్గాన్ బోల్తా పడింది. 91 పరుగులకే ఏడు వికెట్లను తీసి విజయం దిశగా సాగుతున్న అప్ఘానిస్థాన్‌ను మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ అడ్డుకుంది. అఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోసిన మ్యాక్స్‌వెల్ డబల్ సెంచరీతో కంగారులకు చిరస్మరణీయ విజయం అందించాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ విజయావకాశాలుంటాయి. మొదట బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయొచ్చు. ఈ ఎర్రమట్టి పిచ్ ఆట సాగుతున్నా కొద్దీ పేసర్లు, స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఛేదనలో పరిస్థితులు బౌలింగ్‌కు అనువుగా మారే ఆస్కారముంది.