వివేక్ వెంకటస్వామి
భీమారం: తనను అరెస్టు చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. 2023, నవంబర్ 23వ తేదీ గురువారం ఉదయం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలో వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన ఆయనకు మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ… ఓటమి భయంతోనే తనపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలతోనే తనపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. చట్టపరంగానే తన కుటుంబ వ్యాపార వ్యవహారాలు ఉన్నాయన్నారు.
బీజేపీలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిజాయితీగా పనిచేశానని… బీజేపీలో ఉన్నన్నీ రోజులు తనపై ఎలాంటి దాడులు జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ లో చేరి గెలుస్తుండనగానే దాడులు చేయిస్తున్నారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా చెన్నూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు ప్రజలను పట్టించుకోని బీఆర్ఎస్ ను వదిలించుకోవాలి. ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు బాల్క సుమన్ ప్రయత్నిస్తున్నాడని ఆయన అన్నారు. నన్ను అరెస్టు చేసినా ప్రజలే గెలిపిస్తారని వివేక్ అన్నారు.