Monday, December 23, 2024

తెలంగాణలో బీజేపీ, జనసేన పోటీ…

- Advertisement -

తెలంగాణలో బీజేపీ, జనసేన పోటీ…
హైదరాబాద్, జూలై 1,
కేంద్రంలో ఏన్డీఏ కూటమిలో భాగస్వామి… ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలోనూ భాగస్వామి. పొత్తులో భాగంగా కేంద్రంలో టీడీపీకి ఎన్డీఏ ప్రభుత్వం రెండు మంత్రి పదవులు ఇచ్చింది. రాష్ట్రంలోనూ టీడీపీ సారథ్యంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూడా ఒక మంత్రి పదవి ఇచ్చింది. ఇలా బీజేపీతో అటు జాతీయస్థాయిలో.. ఇటు ఏపీలో పొత్తులో ఉన్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం టీడీపీకి దూరంగా ఉంటోంది. పొరుగు రాష్ట్రం ఏపీలో ఉన్న మూడు పార్టీల పొత్తు తెలంగాణలో కొనసాగటంపై కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. బీజేపీ, జనసేన పొత్తుతో పోటీ చేశాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్‌పై ఆశలు పెంచుకుంటోంది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ, జనసేన మైత్రిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీతో బీజేపీ కలుస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ శనివారం కొండగట్టు అంజన్న దర్శనం చేసుకున్నారు. తమ ఇంటి ఇలవేల్పుగా కొండగట్టు అంజన్నను పవన్‌ భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా కొండగట్టుకు వస్తున్నారు. పూజల తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ ఇంటివద్ద సందడి నెలకొంది. పవన్‌ నివాసానికి వచ్చిన సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి సైతం వచ్చారు. మరోవైపు కొండగుట్ట వెళ్తున్న పవన్‌కు సిద్ధిపేటలో అభింఆనులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో ఆయన తెలంగాణలో బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జనసేన కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ పొత్తును తెలంగాణలో కొనసాగించాలని పవన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో టీడీపీతో కూడా పొత్తు ఉన్నందున తెలంగాణలో బీజేపీ–జనసేన మాత్రమే పొత్తులో ఉన్నాయి. టీడీపీని దూరం పెట్టారు. త్వరలో తెలంగాణలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు పంచాయతీ, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లోనూ బీజేపీ–జనసేన కలిసి పోటీచేసే అవకాశం ఉంది.ఏపీలో జనసేన బలం పెరిగింది. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీలు కలిసి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ఏపీలో  ఎన్నికల ఫలితాలు రాక ముందే  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలతో సమావేశం పెట్టారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి రెడీ కావాలని సూచించారు.   తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా చేయని టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడు ఇఫుడు రెట్టించిన ఉత్సాహంతో  టీ టీడీపీని గాడిన పెట్టాలని చూస్తున్నారు.  ఏపీలో అఖండవిజయం సాధించటంతో పాటు 16 పార్లమెంటు సీట్లలో టీడీపీ గెలవటంతో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. జాతీయ  స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. దేశ ప్రభుత్వంలో ఆయనది ఇప్పుడు కీలక పాత్ర.  అందుకే దశాబ్దకాలంగా తెలంగాణాలో దాదాపు భూస్ధాపితమైపోయిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు కల్పించాలని అనుకుంటున్నారు. ఇంతకాలం కేసీయార్ దెబ్బకు చంద్రబాబు తెలంగాణా గురించి ఆలోచించటం మానేశారు. ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటం, కాంగ్రెస్ అధికారంలోకి రావటం, అందులోను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటంతో చంద్రబాబుకు కాస్త ధైర్యమొచ్చిందని అనుకోవచ్చు. అందుకనే హైదరాబాద్ లో రెగ్యులర్ గా తెలంగాణా నేతలతో భేటీ అవుతున్నారు. యువనేతకు బాధ్యతలు ఇచ్చి పాత టీడీపీ నేతల్ని చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దిశగా కొన్ని ముందడుగులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో అసలు పూర్తిగా జెండా ఎత్తేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏపీకే పరిమితమని గతంలో చాలా సార్లు ప్రకటించారు. షర్మిల తెలంగాణలో ప్రత్యేక పార్టీ పెట్టిన తర్వాత అసలు ఆలోచించడం మానేశారు. కానీ వైసీపీ సానుభూతిపరుల సపోర్టు మాత్రం బీఆర్ఎస్ కు లభిస్తూ వస్తోంది. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఖాళీగానే ఉన్నారు.  ఏపీలో ఆయన పార్టీ ఓడిపోవడంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. అయితే పార్టీని విస్తరించుకునే ఆలోచన ఆయన చేయవచ్చని.. బీఆర్ఎస్ తో ఉన్న సాన్నిహిత్యం కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ పార్టీలన్నీ వస్తే.. మళ్లీ తెలంగాణ మీద ఆంధ్రా పార్టీల దాడి పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.తెలంగాణలో పూర్తిగా రాజకీయం మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అయినా మరో పార్టీ అయినా సానుభూతిపరులు సమస్యలు వచ్చినప్పుడు మద్దతుగా ఉంటారేమో కానీ ఓట్ల పరంగా కలిసి వచ్చే అవకాశం ఉండదని రాజకీయవర్గాల అంచనా. తెలంగాణ రాజకీయం పూర్తిగా ఆ రాష్ట్రంతో ముడిపడిపోయింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోటీ కనిపిస్తోంది. చివరికి ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరపున పోటీ చేసినా పట్టించుకోలేదు. ముందు ముందు కూడా ఇతర పార్టీలు పోటీ చేసినా ప్రయోజనం ఉండదని.. ఆయా పార్టీలు నిలదొక్కుకోవడం అంత తేలిక కాదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్‌ తెలంగాణలో బీజేపీతో పొత్తు కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీతోపాటు జనసేన కూడా బలపడుతుందని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణలో బలహీనపడుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టీడీపతో కలిసి పనిచేయడం కన్నా.. జనసేనతో కలిసి పని చేయడమే మేలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్