ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
న్యూ డిల్లీ డిసెంబర్ 28
;దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దేశరాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలపై బాంబులు వేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా
బెదిరింపులకు పాల్పడ్డారు.ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంబై, చెన్నై, అమ్మదాబాద్ ఎయిర్‌పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నట్లు ఈమెయిల్ ద్వారా బెదిరించినట్లు సంబంధిత వర్గాలు
వెల్లడించాయి. బుధవారం రాత్రి 10:23 గంటల సమయంలో బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఆయా విమానాశ్రయాల్లో
తనిఖీలు చేపట్టారు. అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలూ కనిపించలేదు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగా, బుధవారం ముంబైలోని పలు
బ్యాంకులకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు, ప్రముఖ మంత్రుల పాత్ర
ఉన్నదని పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి రాజీనామా చేసి కుంభకోణంపై ప్రకటన చేయకుంటే ఒక దాని తర్వాత ఒకటి బాంబులు పేలుస్తామన్నారు. దీంతో పోలీసులు తనిఖీ దళాలతో సోదాలు
చేశారు. అయితే ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలూ దొరకలేదు.



