తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా తర్వాత వస్తున్న రెండు బ్రహ్మోత్సవాలతో పాటు పెరటాసి మాసం జతకానున్న నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే అంచనాతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మాడవీధుల్లో గ్యాలరీల నిర్మాణం పూర్తికావచ్చింది. పెయింటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రంగవల్లులు, కూల్ పెయింట్ వేస్తున్నారు.పుష్కరిణి మరమ్మతులు పూర్తయిన క్రమంలో నీటిని నింపుతున్నారు. పుష్కరిణి గ్రిల్‌ను రసాయనాలతో శుభ్రపరుస్తున్నారు. ఆలయ గోపురానికి రంగు వేయడం పూర్తి కావడంతో విద్యుత్ అలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. మహారథానికి మరమ్మతులతో పాటు పెయింటింగ్ చేస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు బారికేడ్లు, గ్యాలరీల నిర్మాణం ప్రారంభించారు. తిరుమలలో ముఖ్యమైన కూడళ్లకు, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లకు, ఫుట్‌పాత్ గోడలకు విద్యుత్ అలంకరణ చేస్తున్నారు. పనులు సెప్టెంబరు మొదటి వారానికి పూర్తయ్యేలా టీటీడీ అధికారులున్నారు.
