మాతృ శిశు మరణాల రేటు జీరో స్థాయికి తీసుకరండి
Bring the maternal infant mortality rate to zero
గర్భిణీ. బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించండి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, నవంబర్ 29:-
పుట్టిన వెంటనే నవజాత శిశువులు మృత్యువాత పడకుండా నిరంతరాయంగా పాలఫ్ చేస్తూ పిల్లలను సంరక్షించే బాధ్యత వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మేటర్నిటీ అండ్ చైల్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డా. జఫరుల్లా, జిజిహెచ్ గైనకాలజిస్ట్ డా. పద్మజ, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ శ్రీదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ డా.శ్రీజ, డిఐఓ డా. ప్రసన్న, ఐసిడిఎస్ పిడి లీలావతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో, అప్పుడే పుట్టిన నవజాత శిశువును సంరక్షించుకోవడంలో మెళుకువలతో కూడిన శిక్షణ ఇవ్వాలని వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని ఆదేశించారు. ప్రసవం తర్వాత మాతృ మరణాలు జరిగి పిల్లలను అనాధలు చేస్తున్నామన్నారు. ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉండి కూడా తల్లి బిడ్డలను సంరక్షించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం భాధకరమన్నారు. ఇది నాపని, ఇది వాళ్ళపని ఒకరి మీద ఒకరు వేసుకోకుండా సమన్వయంతో పనులు చేసుకుంటూ వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసమే ప్రతి సోమవారం అధికారులు, సిబ్బందిని ఒకే చోట సమావేశపరిచి కోఆర్డినేషన్ ఇబ్బంది లేకుండా పలు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇటీవల తాను అంగన్వాడి కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు చిన్న గదిని కూడ శుభ్రం పెట్టుకోలేని స్థితిలో వున్నారన్నారు. పిల్లలకు గ్రుడ్లు ఇవ్వడంలో, పోషణ్ అభియాన్ కిట్ల సరఫరాలో నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గత సమావేశంలో నాలుగు మాతృ మరణాలు, మూడు శిశుమరణాలు జరిగాయని… వచ్చే సమావేశానికి జీరో స్థాయిలో ఉండాలని చెప్పినప్పటికీ ప్రస్తుత క్వార్టర్లో మూడు శిశు మరణాలు, ఒక మాతృ మరణం జరగడం బాధాకరమన్నారు. మాతృ శిశు మరణాల నివారణలో వైద్యశాఖ స్త్రీశిశు సంక్షేమ శాఖలు పూర్తిగా వైఫల్యం చెందాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.