- Advertisement -
గులాబీల దారెటు…
BRS route to where..?
హైదరాబాద్, సెప్టెంబర్ 30, (వాయిస్ టుడే)
జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మూసీ ప్రక్షాళన అంశం చర్చకు వస్తుంది. 2020 నవంబర్‌లో ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ చాలా చెప్పారు. గోదావరిని మూసీతో కలుపుతామన్నారు. మిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలను గోదావరి నీళ్లతో నింపుతామని చెప్పారు. మూసీలో పిల్లలు బోటింగ్ చేసేలా తీర్చిదిద్దుతామన్నారు. ఫ్రాన్స్‌లో నది, లండన్ థేమ్స్ అంటూ ఏవేవో చెప్పుకొచ్చారు.కానీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా బీఆర్ఎస్ పాలనలో ఏం జరగలేదు. మూసీ అదే మురికి కూపంగా కనిపిస్తోంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే మూసీ ప్రక్షాళన కోసం ఓ ప్రణాళికను తీసుకొచ్చింది. మూసీ నదిపరివాహక ప్రాంతాల్లో కబ్జాలకు గురైన ప్రాంతాన్ని గుర్తించి, అందులో ఉన్న నిర్మాణాలను ఖాళీ చేయిస్తోంది. ఈ క్రమంలో కొందరు ఆందోళనలకు దిగుతున్నారు. అయితే, వారితో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.మూసీ నిర్వాసితులకు తెలంగాణ భవన్ కేరాఫ్‌గా మారింది. అక్కడి నివాసితులు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో భేటీ అయ్యారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. ఏ అవసరమొచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి, 24 గంటలు మా న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్‌లోనే ఉంటుందంటూ గులాబీ నేతలు భరోసానిచ్చారు. మీకు రక్షణ కవచంగా నిలబడతామని, సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విమర్శలు చేశారు.మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయని విమర్శలు చేశారు. నిరాశ్రయులకు, నిస్సహాయులకు అండగా ఉండటంలో తప్పు లేదు. ఉండాలి కూడా. తప్పు జరిగితే ప్రశ్నించాలి. నిలదీయాలి. అవసరమైతే గల్లా పట్టుకొని ఎదిరించాలి. కానీ, బీఆర్ఎస్ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణ భవన్‌కు వెళ్లిన వారిలో చాలావరకు అద్దెకు ఉండేవాళ్లేనని తెలుస్తోంది. పైగా వాళ్లకు నోటీసులు వెళ్లింది లేదు, ఇళ్లకు మార్క్ చేసిందీ లేదు. అయితే, ధైర్యం చెప్పాల్సిన లీడర్లు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండడంపై భిన్న వాదనలు జరుగుతున్నాయి. వారి భయాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే యత్నాలు ఆపాలంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌పై మండిపడుతున్నారు నెటిజన్లు. పైగా, హరీష్ రావు మూసీ పరివాహిక ప్రాంతాలలో పర్యటిస్తామని చెప్పడంపై మండిపడుతున్నారు. పదేళ్లలో పట్టించుకోనివారు ఇప్పుడొచ్చి డ్రామాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. అద్దెకు ఉంటున్నవాళ్లు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయిస్తే ఎక్కడకు వెళ్లాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకూ డబుల్ బెడ్రూం ఇవ్వాలంటున్నారు. వారిని బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడంపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.ఓవైపు నిర్వాసితులతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంటే, ఇంకోవైపు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులు కొనసాగుతున్నాయి. మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించింది. మలక్ పేట్, శంకర్ నగర్‌కు చెందిన నిర్వాసితులకు సైదాబాద్ మండలంలోని డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించారు. సంబంధిత అధికారులు సహాయ సహకారాలు అందిస్తూ వారికి పత్రాలు అందజేశారు. ఆ ఇళ్లలో కరెంట్, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలను కల్పించారు. తమకు డబల్ బెడ్రూం ఇళ్లు కేటాయించడం పట్ల మూసీ నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.మూసీ సుందరీకరణపై ప్రభుత్వానికి ఓ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లో వరదలను కంట్రోల్ చేయడానికే, ఇదంతా చేస్తున్నామని చెబుతోంది. ఎవరికీ అన్యాయం జరగనివ్వమని, మూసీ బాధితులందరికి అన్యాయం చేయమని అంటోంది. ఇదంతా ప్రజల కోసమే చేస్తున్నామని చెబుతోంది. కానీ, ప్రధాన ప్రతిపక్షం మాత్రం దీన్ని ఓ పొలిటికల్ ఎజెండానే చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ అంశాన్ని ఓ అస్త్రంగా మలుచుకొని అధికార పక్షంపై పోరాటానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ వైఖరి రైటా ? రాంగా ? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
- Advertisement -