హైదరాబాద్, నవంబర్ 11, (వాయిస్ టుడే): ఎన్నికల ప్రచారం అంటే పోస్టర్లు, పాంప్లెట్లు, ప్రచార వాహనాలు, మైకులు, బహిరంగసభలు. అంతేనా ఇదంతా పాతకాలపు ప్రచారం ఇప్పుడు అసలైన ప్రచారం ఆన్ లైన్ జరుగుతోంది. సోషల్ మీడియా ప్రచారం అంటే.. పోస్టులు పెట్టడం.. బాట్స్ పెట్టి షేర్లు చేసుకోవడం.. పార్టీ సోషల్ మీడియా సైన్యాలతో పాజిటివ్ ప్రచారం చేసుకోవడం నిన్నామొన్నటిదాకా కొత్త స్టైల్. కానీ ఇప్పుడు ఇన్ ఫ్లూయన్సర్స్ ను రంగంలోకి దింపేశారు. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో దూకుడుగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ గతం కంటే ఈసారి సోషల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎక్కువమంది ఆకర్షితులు అయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వ సక్సెస్ స్టోరీలను ప్రచారంలోకి తెచ్చేందుకు విభిన్నమైన ప్రయత్నాలుచేస్తోంది. దళితబంధు, రైతుబంధు, టీఫ్రైడ్, కళ్యాణలక్ష్మి, బీసీ, మైనార్టీలకు లక్షసాయం వంటి సంక్షేమ పథకాలను కేస్ స్టడీలతో ట్రెండింగ్ చేసేందుకు.. హైదరాబాద్ అభివృద్ధిని ప్రజల ముందు పెట్టేందుకు ఇన్ ఫ్లూయన్సర్స్‌ను రంగంలోకి దింపారు. పాటలు పాడు.. నాడు ఎట్లుండే..
నేడు ఎట్లుండే వారు వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తున్నారు. అదే సమయంలో సమాంతరంగా గులాబీ జెండాలే రామక్క అనే పాటను బీఆర్ఎస్ నేతలు వైరల్ చేశారు. ఇలా ఇన్‌ఫ్లూయన్సర్స్ చేసిన వీడియోలను గ్రామాలవారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లోనూ అభివృద్ధిని పోస్టుచేయాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్, తాగునీటి పైపులైన్లు, ఇతరత్రా చేపట్టిన పనులను ఎంత వ్యయంతో చేశారనే వివరాలను సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా ఇతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల పరిస్థితిని సైతం వివరించే ప్లాన్ చేస్తున్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై, ముఖ్యంగా దళితబంధు, రైతుబంధు, ప్రైడ్, కల్యాణలక్ష్మి, బీసీమైనార్టీలకు లక్షసాయం, రైతుబీమా, 24 గంటల కరెంటు, ఇంటింటికీ తాగునీరు, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటివి లబ్దిదారులతో కేస్ స్టడీ వారీగా సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఎవరు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్, ట్విట్టర్ ఇలా దేనిని ఓపెన్ చేసినా తెలంగాణ సంక్షేమ పథకాలే ప్రత్యక్షం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలను మేనిఫెస్టోను సైతం వివరించే ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం లీజుకు తీసుకోవడం, కొన్నింటిని నడిపిస్తూ సంక్షేమ పథకాలను విస్తృత ప్రచారం చేయడం చేస్తున్నారు. కేటీఆర్ నిత్యం పర్యవేక్షణ చేయడంతో పాటు సలహాలు సూచనలు ఇస్తూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఎలా ఇవ్వాలలో నిర్వాహకులకు ఆదేశాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ కృషి చేస్తుంటే.. పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. లాస్ ఎంజెల్స్ దగ్గర్నుంచి సిద్దిపేట ఐటీ టవర్ వరకూ ఈ వీడియోలు చేయిస్తున్నారు. ఇందు కోసం ఎంత ఖర్చవుతుందో కానీ… చాలా సులువుగా కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. అవే వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని దానికి గులాబీల దొంగలే రామక్క అని రీమిక్స్ చేసి.. సోషల్ మీడియాలో వదులుతున్నారు. కొన్ని సొంత ప్రచార వీడియోలు తీసి కాంగ్రెస్ వైరల్ చేస్తోంది. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నవారికి గాలమేస్తున్న రాజకీయ పార్టీలు వారిని ప్రచారానికి వాడుకుంటూ అడిగిన మొత్తాన్ని చేతిలో పెడుతున్నాయి. సరదాగా రీల్స్ చేస్తూ కంటెంట్ ఇస్తూ అనుచరులను పెంచుకుందామని చేసిన ప్రయత్నాలు.. ఇప్పుడు వారికి సరికొత్త ఆదాయాన్ని తెస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
రీల్స్ చేయడం, పార్టీ నేతల ప్రచారాలు,
జనాల స్పందన ఇతరత్రా వీడియోలను ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఖాతాల్లో పెడుతూ మరింత ప్రచారం కల్పిస్తున్నారు. ఇలాంటి వారితో ప్రచారం చేయిస్తే సులువుగా ఎక్కువ మందికి చేరొచ్చని ఆలోచించిన ఆయా రాజకీయ పార్టీల వార్‌రూమ్‌ల ప్రతినిధులు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. వారి వీడియోలకు ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉంటే రెట్టింపు ముట్టచెబుతున్నారు. మిలియన్లలో సబ్‌స్క్రైబర్‌లున్న ఖాతాలు, యూట్యూబ్ వ్లాగర్లు, బ్లాగర్లను ఎంపిక చేసిన బీఆర్ఎస్ వారి సేవల్ని ఉపయోగించుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. గ్రేటర్ పరిధిలోని ఆయా పార్టీల నేతలు, ట్రావెల్, ఫుడ్, హోమ్ మేకింగ్ సంబంధిత వ్లాగ్‌లు చేస్తున్నవారితో పాటు కొంతమంది నటీనటులను సంప్రదించి ఇప్పటికే తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. బీఆర్ఎస్ ఇలాంటి ప్రచారంలో ముందుంది. అయితే ఇతర పార్టీలు కూడా తక్కువేమీ కాదు. బీఆర్ఎస్ విడుదల చేసిన ‘గులాబీ జెండాలమ్మ’, కాంగ్రెస్ పార్టీకి చెందిన ‘మా తాత కాంగ్రెస్, ముత్తాత కాంగ్రెస్’, బీజేపీకు చెందిన ‘తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా’ అనే పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతి సర్వత్రా వర్జయేత్ అయితే ఈ వైరల్ కంటెంట్ వల్ల రాజకీయ పార్టీలకు ఎంత మేలు జరుగుతుందోకానీ.. నెగెటివిటీ మాత్రం పెరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అతి ప్రచారం చేసుకునే పార్టీలపై యువత సహజంగానే వ్యతిరేకత చూపిస్తూంటారు. అధికార పార్టీ ఈ ప్రచారంలో ముందు ఉంది. ఏ యాప్ తెలిచినా.. ఏ వెబ్ సైట్ తెరిచినా.. బీఆర్ఎస్ ప్రచారం కనిపిస్తోంది. అది అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా మారుతోందన్న భావన కూడా వస్తోంది.