Sunday, September 8, 2024

బీఎస్పీ ఓటు…  ఎవరికి చేటు

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 7, (వాయిస్ టుడే ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలన్నీ తలో దిక్కు చేరిపోతున్నాయి. అయితే పొత్తులు లేకపోతే పోటీ నుంచి విరమించుకోవడం వంటివి చేస్తున్నాయి. కానీ బహుజనసమాజ్ పార్టీ మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. ఒంటరిగా పోటీ చేస్తోంది. కనీసం వంద స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మూడు జాబితాల ద్వారా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అందరి దృష్టిని ఆకర్షించేలా ఓ ట్రాన్స్ జెండర్‌కూ టిక్కెట్ కేటాయించారు. మరో వైపు తాను స్వయంగా జనరల్ సీటులో పోటీకి దిగారు. సిర్పూర్ నుంచి తాడోపేడో తేల్చుకుంటానంటున్నారు. దీంతో ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై రాజకీయవర్గాల్లో భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ ఉనికి  గతంలో పెద్దగా ఉండేది కాదు. ఏదైనా పార్టీలో టిక్కెట్లు దొరకని నేతలు బీఎస్పీ బీఫాం తెచ్చుకుని పోటీ చేసి తమ సత్తా చాటేవారు. 2014లో బీఎస్పీకి ఆదిలాబాద్ జిల్లాలో రెండు సీట్లు వచ్చాయి. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు కోనేరు కోనప్ప బీఎస్పీ సీట్లపై గెలిచారు.  కానీ వారు కేవలం బీఫాం కోసమే ఆ పార్టీలో చేరారు. ఓ రకంగా ఇండిపెండెంట్లుగా గెలిచారు. తర్వాత వారు బీఆర్ఎస్ లో చేరారు. అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మరోసారి పోటీ చేస్తున్నారు. ఆ పార్టీకి స్థిరమైన నాయకత్వం లేదు. జాతీయ అధ్యక్షురాలు మాయవతి కూడా ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఐపీఎస్‌గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత  ఆ పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సాదాసీదా ఐపీఎస్ కాదు. ఆయన ఐపీఎస్ అయినా.. పోస్టింగ్ మాత్రం సాంఘిక సంక్షేమ శాఖలో తీసుకున్నారు.  తెలంగాణలోని గురుకుల పాఠశాలవ్యవహారాలను తొమ్మిదేళ్ల పాటు తన కనుసన్నల్లో ఉండేలా చూసుకున్నారు.  ” స్వేరోస్‌” అనే సంస్థను పాతుకుపోయేలా చేయగలిగారు. సోషల్ వెల్ఫేర్ ఏరోస్ ను స్వేరోస్‌గా పిలుస్తారు. ఈ సంస్థను ప్రవీణ్ కుమార్ ప్రారంభించ లేదు. కానీ ఈ సంస్థకు వెన్నుముకగా ఆయన నిలిచారు.  ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకల హాస్టళ్లలో స్వేరోస్ విస్తృతంగా విస్తరించారు. మెల్లగా స్వేరో భావాజాలను దళిత కాలనీలకు విస్తరించారు. స్వేరోస్ భావజాలం.. చాప కింద నీరులా విస్తరించింది. ఇప్పుడు వీరినే ప్రవీణ్ కుమార్ తన బలంగా భావిస్తున్నారు. దళిత భావజాలాన్ని అందుకే విస్తృతంగా వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 63,60,158 మంది దళితులున్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 17.5 శాతం. వీరు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని మార్చేయగలరు. ఆ విషయం రాజకీయ పార్టీలకు తెలుసు కాబట్టే.. దళిత వాదం అందుకుంటున్నారు. అయితే.. దళితుల్లో సహజంగానే తమను పైకి రానివ్వడం లేదన్న అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి నుంచి ఇప్పటి వరకూ ఒక్క సరైన నాయకుడు పుట్టుకురాలేదు. ఇప్పుడు తాను ఆ బాధ్యత తీసుకుంటానని.. వారికి నాయకుడిగా ఎదగాలని ప్రవీణ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆయన చాలా కాలం నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. దానికి స్వేరోస్‌నే సాక్ష్యం. స్వేరోస్  తెర వెనకు ప్రచారంలో సిద్ధహస్తులు. అందుకే బీజేపీ ఎంత ప్రభావం చూపిస్తుందన్నది అంచనా వేయడం కష్టంగా మారింది. రిజర్వ్ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ  బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ జనరల్ సీటు అయిన సిర్పూల్‌లో పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో 90 శాతానికిపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు ఉన్నాయి.  అభ్యర్థుల విజ యంలో ఈ ఓటర్లే కీలకపాత్ర పోషిస్తారు. కొంతకాలంగా అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రవీణ్ కుమార్.. ​దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనారిటీల పక్షాన గళం విప్పుతున్నారు. బహుజనులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్​ భూములను అభివృద్ధి పనుల పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో పాటు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపైనా ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇంటర్మీడియెట్ ​స్టూడెంట్లకు ఉచిత భోజనం లాంటి సేవా కార్యక్రమా లతో కోనప్ప యువతకు దగ్గరయ్యారు. ఇప్పుడా యూత్ తమవైపు మళ్లుతున్నారని ప్రవీణ్ అనుచరులు నమ్ముతున్నారు.   స్వేరోస్ నాయకులు ఇప్పటికే సిర్పూర్​లో దిగి, చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ రాజకీయ ఆశలతో వచ్చిన జేపీ, వీవీ లక్ష్మినారాయణ వంటి వారిలా కాకుండా ఓ పార్టీ రాష్ట్ర శాఖకు నాయకత్వం వహిస్తూ.. నిరంతరం పోరాడుతున్నారు. ఆ పోరాట పటిమ ద్వారా ఓ బలమైన నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీలతో పొత్తులకు అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. దళిత వర్గాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ ఓట్లు పొందితే ఎవరు నష్టపోతారన్న సంగతి పక్కన పెడితే.. ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్