- Advertisement -
ఫిబ్రవరి 24 నుంచి బడ్జెట్ సెషన్
Budget session from February 24
విజయవాడ, ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1 కేంద్రం తన వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. ఇందులో రాష్ట్రానికి వచ్చే నిధులు అంచనా వేసుకొని రాష్ట్ర బడ్జెట్‌కు సిద్ధం చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలు కూడా వెళ్లినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి పది నెలలు కావొస్తోంది. ఇంత వరకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తోనే ఆర్థిక కార్యకలాపాలు నడిచాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు వీలు పడలేదు. ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నందున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయింది. అంతకు ముందు ఉన్న వైసీపీ సర్కారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని ఆరోపిస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేలా పరిస్థితులు లేవని చెప్పుకొచ్చింది. ఓటాన్ అకౌంట్‌తోనే నెట్టుకొచ్చిన సర్కారు మరోసారి నవంబర్‌లో అదే ఫాలో అయింది. అప్పుడు కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత తొలిసారిగా ఈ ఫిబ్రవరిలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్‌తోపాటు మిగతా అభివృద్ది పథకాలు నిధులు సర్ధుబాటు చేయడం ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటి ప్రక్రియే. అయినా కేంద్రం సాయం అందిస్తున్న నమ్మకంతో బడ్జెట్ కసరత్తు చేస్తోంది. పథకాల అమలుతోపాటు అమరావతి, పోలవరం, కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కూడా బడ్జెట్‌లో చేర్చాలి. వీటన్నింటికీ ఎలా నిధులు కేటాయిస్తారనే ఆసక్తి ప్రజల్లో ఉంది. ఫిబ్రవరి 24 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాలు దాదాపు నెల రోజుల పాటు నిర్వహించాలని చూస్తోంది. సమగ్రంగా అన్ని అంశాలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పుడూ పది ఐదు రోజులకు మించి జరగని సమావేశాలు చాలా కాలం తర్వాత ఇన్ని రోజులు జరగనున్నాయి. బడ్జెట్‌పై చర్చతోపాటు కీలకమైన కొన్ని పథకాల అమలుపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశాల్లోనే మరికొన్ని కీలక బిల్లులు కూడా ఆమోదించనున్నారు. ప్రమాణ స్వీకారానికి తప్ప ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్న వైసీపీ ఈసారైనా వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో అతి పెద్ద ప్రతిపక్షమైనందున ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. అప్పటి వరకు సభకు వచ్చేది లేదని తేల్చి చెప్పారు. వచ్చినా మాట్లాడేందుకు ప్రజా సమస్యలు చర్చించేందుకు తగిన సమయం ఇవ్వబోరని అందుకే సభకు రావడం లేదని చెబుతున్నారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా తాము ఎలా ఇస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. సభా సమావేశాలు ఎగ్గొట్టేందుకే వైసీపీ కారణాలు వెతుక్కుంటోందని ఆరోపిస్తున్నారు. సభకు వచ్చిన తర్వాత ఎంత మాట్లాడనిచ్చారా లేదా అనేది తెలుస్తుందని రాకుండా నిందలు వేయడం ఏంటని నిలదీస్తోంది.
- Advertisement -