ఆధునిక సాంకేతిక కాలం లో డ్రోన్ లు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి.ఈ మధ్య కాలం లో డ్రోన్ లను వివిధ రకాలైన వ్యక్తులు వాడుతున్నారు.అయితే వినూత్నంగా తెగిన కేబుల్ వైర్ ను అతికించడానికి వాడాడు ఓ కేబుల్ ఆపరేటర్.
గడచిన నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (యం) మండలం పారుపల్లి ,గుండాల మండలం సుద్దాల మధ్య బిక్కేరు వాగు చాలా ఉదృతంగా ప్రవహిస్తుంది.గుండాల మండలం లోని అనేక గ్రామాలకు పారుపల్లి నుండి బిక్కేరు వాగు మీదుగా కేబుల్ టీవీ కి సంబంధించిన వైరు వెళుతుంది. అయితే భారీ వర్షాలకు వాగు మధ్యలో కేబుల్ వైరు తెగిపోయింది.దాంతో నాలుగు రోజులుగా గుండాల మండలం లోని అనేక గ్రామాల్లో కేబుల్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. దాంతో వినియోగదారుల నుండి కేబుల్ ఆపరేటర్ కి ఒత్తిడి ఏర్పడింది. వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో కేబుల్ ఆపరేటర్ ఏమీ చేయలేని పరిస్థితి.దీంతో కేబుల్ ఆపరేటర్ కి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. డ్రోన్ ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసుకుందామని అనుకున్నాడు.
అందుకు తగ్గ డ్రోన్ లు ఎక్కడున్నాయని విచారిస్తే నల్లగొండ జిల్లా కట్టంగూర్ లో ఉందని తెలుసుకొని ఈ రోజు పిలిపించాడు. డ్రోన్ నిర్వాహకులు పారుపల్లికి వచ్చి తెగిన కేబుల్ వైర్ ఒక కొస ను డ్రోన్ కి తగిలించి దాని సహాయం తో వాగు అవతలి వైపుకు ఉన్న కేబుల్ ఆపరేటర్ కు అందించారు.అది అందుకున్న కేబుల్ ఆపరేటర్ తెగిన కేబుల్ వైర్ ను అతికించి కేబుల్ ప్రసారాలను పునరుద్ధరించారు.దాంతో కేబుల్ వినియోగదారులు సంతృప్తి చెందారు..అలా డ్రోన్ సహాయం తో కేబుల్ ఆపరేటర్ తన సమస్యను పరిష్కరించుకున్నాడు. .వినూత్నంగా ఆలోచించిన కేబుల్ ఆపరేటర్ ను అందరూ అభినందిస్తున్నారు.