ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తులకు కేంద్రం సానుకూల స్పందన
భద్రాద్రి అభివృద్ధికి ఎయిమ్స్, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, రైల్వే డివిజన్ ప్రతిపాదనలపై పరిశీలన
Centre responds positively to MP Vaddiraju’s requests.
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 19:** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చేసిన విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, రైల్వే డివిజన్ ఏర్పాట్ల అవసరాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. అనంతరం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పౌర విమానయాన, రైల్వే శాఖల మంత్రులకు సమగ్ర వివరాలతో వినతిపత్రాలు సమర్పించారు.
ఈ ప్రతిపాదనలను పరిశీలించిన సంబంధిత మంత్రిత్వ శాఖలు సానుకూలత వ్యక్తం చేస్తూ శుక్రవారం ఎంపీ వద్దిరాజుకు లిఖితపూర్వకంగా సమాధానం పంపాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పారిశ్రామిక, ఇంధన, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఎంపీ సూచనలు, సలహాలను కేంద్రం గుర్తించినట్లు లేఖల్లో పేర్కొన్నాయి.
తన వినతిపత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, దేశ ఇంధన అవసరాలకు కీలకమైన బొగ్గు ఉత్పత్తిని సింగరేణి సంస్థ అందిస్తోందని, కొత్తగూడెం దాని ప్రధాన కేంద్రంగా ఉందని వివరించారు. అలాగే దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రం ఈ జిల్లాలోనే ఉందని, దక్షిణ గంగా అని పిలువబడే గోదావరి నది జిల్లా గుండా ప్రవహిస్తోందని పేర్కొన్నారు.
అదేవిధంగా 1932లో ప్రారంభమైన కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్‌కు శతాబ్ది సమీపిస్తున్న నేపథ్యంలో దీనిని రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరారు. అలాగే ఈ మార్గాన్ని భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, ఒడిశాలోని మల్కాన్‌గిరి వరకు విస్తరిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగు రాష్ట్రాలకు భద్రాద్రి జిల్లా కీలక రవాణా కేంద్రంగా మారుతుందని సూచించారు.
రైల్వే డివిజన్, ఎయిమ్స్, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుపై ఎంపీ చేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు లేఖ రాసి స్పందించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించడం స్థానిక ప్రజల్లో ఆశాభావాన్ని పెంచిందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.




