హైదరాబాద్, ఆగస్టు 16: ఒకప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్ అనగానే అక్కడ రద్దీ షాపింగ్.. ఉద్యోగుల హడావుడి.. పండుగలు వస్తే చాలు కళకళలాడుతూ కనిపించేది. కానీ ఇప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్ అనగానే ఇటీవల జరిగినటువంటి భారీ అగ్నిప్రమాదమే గుర్తువస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన తర్వాత అతిపెద్ద భారీ మోసం తెర మీదకు వచ్చింది. అదే క్యూనెట్ మల్టీ మార్కెటింగ్ మోసాలు.. సంచలనంగా మారినటువంటి ఈ కేసులో తల్లిదండ్రులు తమ బిడ్డలను పోగొట్టుకున్నదే కాక.. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్న వాళ్ళ ఆశలు సైతం కాలి బూడిదయ్యాయి. తమ బిడ్డల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బును పంట పొలాలను అమ్మి మరి.. యూనిట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో పెట్టారు. కానీ అది మోసం అని గమనించి బాధితులు నరకయాతన అనుభవించారు. అటు కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఇటు డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం తర్వాత ఈ మోసానికి సంబంధించి అసలు బండారం బయటపడింది. హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని చైన్ లింకింగ్ మోసాలకు పాల్పడిన క్యూనెట్ కేసులో కీలక నిందితుడు ఉపేంద్ర నాథ్ రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న ఉపేంద్ర నాథ్ రెడ్డి బెంగళూరులో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో నగర సిసిఎస్ పోలీసులు బెంగళూరుకు వెళ్లారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
స్థానికంగా ఉన్నటువంటి న్యాయస్థానంలో హాజరు పరిచి అనంతరం హైదరాబాద్ తీసుకువచ్చారు.2017లో తెలంగాణ ప్రభుత్వం మల్టీ మార్కెటింగ్ పై నిషేధం విధించడంతో క్యూనెట్ కార్యకలాపాలు నిలిపివేసింది. కర్ణాటకకు చెందిన రాజేష్ కన్నా ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నమ్మ పల్లి గ్రామ వాసి అయినటువంటి ఉపేంద్రనాథరెడ్డి తో పాటుగా మరికొందరు కలిసి పేరు మార్చి విహాన్ డైరెక్టర్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. గుట్టుగా ఈ వ్యాపారాన్ని సాగించారు. అయితే, సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు యువతి యువకులు మరణించిన అనంతరం ఈ మల్టీ మార్కెటింగ్ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఈ కామర్స్ వ్యాపారంలో పెట్టుబడితో ప్రతి నెల 20వేల నుంచి 60 వేల వరకు సంపాదించవచ్చు అంటూ అమాయకపు నిరుద్యోగ యువతను నిందితులు నమ్మించారు. అనంతరం వందలాది మంది నిరుద్యోగ యువత నుంచి లక్షల రూపాయలను వసూలు చేశారు.ఇలా రాష్ట్రంలో 163 మంది బాధితుల నుంచి ఏకంగా మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. మొదటగా లాభాల ఆశ చూపించిన ఉపేంద్ర నాథ్ రెడ్డి.. ఆ తర్వాత లాభాలను ఇవ్వకుండా ముఖం చాటేస్తూ ఉండడంతో బాధితులు పలుమార్లు నిలదీశారు. కొత్తగా సభ్యులను చేర్పిస్తే డబ్బు తిరిగి ఇస్తామంటూ మెలిక పెట్టి మరికొంతమంది నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా మార్చుకున్నారు. అయితే, స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం తర్వాత మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ యూనిట్ మోసాల గురించి బయటపెట్టారు. ఈ ఘటనపై మహంకాళి పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అనంతరం కోట్ల రూపాయల వరకు మోసం జరిగిందని నిర్ధారించి ఈ కేసును సిసిఎస్ కు బదిలీ చేశారు. స్వయంగా ఈ కేసును హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. ఇప్పటికే ఈ కేసులో 15 మంది నిందితులను గుర్తించారు. గతంలో ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు.. 35 బ్యాంకు ఖాతాలోని 54 కోట్ల వరకు సీజ్ చేసి ప్రధాన నిందితులపై నిఘా పెట్టారు. చాలా రోజుల తర్వాత పోలీసులు ప్రధాన నిందితుడైన ఉపేంద్రనాథ్ రెడ్డిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.