కర్నూలు, సెప్టెంబర్ 9, (వాయిస్ టుడే): శనివారం ఉదయం ఆరు గంటలకు స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు పోలీసులు. సిఆర్పిసి సెక్షన్ 50(1) నోటీస్ సర్వ్ చేశారు. ఇది సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరు మీద వచ్చింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 ఎండ్ 37 ఏపీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.దాదాపు 12 గంటల పాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. టీడీపీ అధినేత చంద్రబాబును సిట్ అధికారులు అరెస్టు చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేస్తున్నట్టు చంద్రబాబుకు సిట్ తరఫున వచ్చిన డీఐజీ రఘురామరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సిట్ అధికారులకు, చంద్రబాబు, ఆయన తరఫు లాయర్లకు మధ్య ఆసక్తికరమైన వాదన జరిగింది. దాదాపు ఐదున్నర గంటల సమయంలో చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్ తలుపు తట్టారు. పోలీసులు పిలవడంతో చంద్రబాబు బయటకు వచ్చి డీఐజీ రఘురామరెడ్డితో మాట్లాడారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇచ్చి మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని చెప్పారు.పోలీసుల ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని న్యాయవాదులు, చంద్రబాబు పరిశీలించారు. ఎఫ్ఐఆర్‍లో చంద్రబాబు పేరు లేదని న్యాయవాదులు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అని నిలదీశారు. అరెస్టుకు ముందు ఆ పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు ఆర్గ్యూ చేశారు. పౌరుడిగా తన హక్కని అన్నారు. అరెస్టు చేసిన తర్వాత తగిన పత్రాలు ఇస్తామన్నారు పోలీసులు. దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉందన్నారు చంద్రబాబు,
ఆయనతరఫు న్యాయవాదులు. అరెస్టు నోటీసులు ఇచ్చామని సమాధానం చెప్పారు పోలీసులు. డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామన్నారు. 24 గంటల్లో అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలు ఇస్తామన్నారు. అవగాహన లేకుండా చంద్రబాబు న్యాయవాదులు వ్యవహరిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. పోలీసుల తీరే అవగాహన లేకుండా ఉందన్నారు చంద్రబాబు. తాను రోడ్డుపైనే ఉన్నానని… ఎక్కడికి పారిపోవడం లేదన్నారు. అర్ధరాత్రి వచ్చి భయోత్సాతం సృష్టించాల్సిన అవసరమేంటి? నిలదీశారు.చంద్రబాబు బయటకు రాకపోయినా, టీడీపీ లీడర్లు అడ్డు తొలగకపోయినా ఆయన విశ్రాంతి తీసుకుంటున్న బస్‌ను టోయింగ్ చేసుకొని తీసుకెళ్తామన్నారు. ఇలా సుమారు గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది. అక్కడ ఉన్న టీడీపీ నేతలతోపాటు మీడియాను కూడా బయటకు పంపేశారు. మెడికల్ యూనిట్‌లను సిద్ధం చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తారని శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాతోపాటు కొన్ని న్యూస్ ఛానల్స్‌లో వచ్చింది. నంద్యాలకు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి పోలీసులను రప్పించారని టాక్ నడుస్తోంది. నిన్న సాయంత్రం నుంచే చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం చేశారని సమాచారం. లేదు లేదంటూనే సైలెంట్‌గా పని కానిచ్చేశారని ఈ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. నంద్యాల వ్యాప్తంగా ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. అన్ని పక్కగా చేసిన తర్వాత డీఐజీ రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల మంది పోలీసుల టీం చంద్రబాబు ఉంటున్న బస్ వద్దకు వచ్చింది. పోలీసులు ఇలా ఒక్కసారిగా రావడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. అసలు అర్థరాత్రి జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తిని డిస్టర్బ్ చేయడమేంటని ప్రశ్నించాయి. మొదట చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చామని మొదట చెప్పినట్టు టీడీపీ లీడర్లు చెబుతున్నారు. తర్వాత చంద్రబాబు విదేశాలకు పారిపోతారనే అనుమానం ఉందని అందుకే వచ్చామని తర్వాత చెప్పారట. ఇలా పదే పదే మాట మారుస్తూ అక్కడ టీడీపీ లీడర్లతో వాగ్వాదం జరిగింది. పోలీసులు అటుగా వెళ్లకుండా తొలుత టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వారిని బలవంతంగా నెట్టుకొని లోపలికి వెళ్లాయి. అక్కడ టీడీపీకి చెందిన జిల్లా నేతలు, మాజీ మంత్రులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు ప్రధాన భద్రత అధికారి, ఎన్‌ఎస్‌జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌కి పోలీసులు సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి చంద్రబాబుని నిద్రలేపడం పద్ధతి కాదని… ఆయన ఎక్కడికీ పారిపోరని టీడీపీ నేతలు చెప్పారు. తప్పుడు సమాచారం ఆధారంగా వచ్చారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పోలీసులు ఐపీఎస్ చదువులు మర్చిపోయి వైసీపీ చట్టాలను వంటబట్టించుకున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్సు డోర్ కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. మరో వైపు ప్రజాసమస్యలపై పోరాడుతున్న తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం అరెస్టు చేస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇలాంటి సందర్భంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసారు.