మొగిలిగిద్ద అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి
Chief Minister's efforts for the development of Mogiligidda
జనవరి 31న సాయంత్రం నాలుగు గంటలకు పర్యటన ఖరారు
సుమారు పదివేల మందితో మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవం
కాంగ్రెస్ సర్కార్ లో విద్యా, వైద్యం, నిరుద్యోగ ఉపాధి పై దృష్టి
అభివృద్ధి విషయంలో భేషజాలాలకు పోవద్దు
షాద్ నగర్ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతో ఘన చరిత్ర కలిగిన మొగలిగిద్ద గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
బుధవారం షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మొగలిగిద్ద గ్రామ పెద్దలు, నియోజకవర్గ ఆయా మండలాల పార్టీల అధ్యక్షులు, ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు.. ఈనెల 31న సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సుమారు పదివేల మంది హాజరవుతారని తెలిపారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జనాలు పెద్ద ఎత్తున ఆసక్తిగా చూస్తారని అయితే 150 వార్షికోత్సవ పాఠశాలకు సంబంధించిన విద్యాభివృద్ధి కార్యక్రమం కాబట్టి పదివేల మందితో 16 ఎకరాల్లో పర్యటన కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. సహజంగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా గ్రామ అభివృద్ధి పై కొంత ఆసక్తి నెలకొని ఉంటుందని అయితే ముఖ్యమంత్రి గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళిక చర్యలు తీసుకోవాలో ఆలోచించడం జరుగుతుందని, ప్రజల అంచనాలకు అనుగుణంగానే అభివృద్ధి ఉంటుందని శంకర్ స్పష్టం చేశారు. గ్రామ నివాసి ప్రొఫెసర్ హరగోపాల్ ఇంత వృద్ధాప్యంలో కూడా విద్య అభివృద్ధి కోసం పడుతున్న తాపత్రయం ఎంతో గొప్పదని అభివర్ణించారు. గత పదేళ్లలో మొగిలిగిద్దలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఒక చరిత్ర కలిగిన గ్రామం అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో గ్రామ అభివృద్ధి గ్రామ చరిత్ర దశ దిశల వ్యాపిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.