వాతావరణ ఉష్ణోగ్రతల అదుపునకు క్లీన్ ఎనర్జీ ఒక్కటే పరిష్కారం!
Clean energy is the only solution for climate control!
భారత గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 8లక్షల కోట్ల పెట్టుబడులు
2030నాటికి 18 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యంగా ఎపి అడుగులు
ఎపిలో ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు సిద్ధం
వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్
దావోస్:
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించి, వాతావరణంలో ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్ బెల్వెడేర్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా “పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్వనీతి ఇనిషియేటివ్ సిఇఓ రిత్వికా భట్టాచార్య వ్యాఖ్యాతగా వ్యవహరించగా, జోర్డాన్ క్వీన్ డాక్టర్ రానియా అల్ అబ్దుల్లా, పోర్చుగల్ మాజీ ప్రధాని జోస్ మాన్యుల్ బరాసో, యునెస్కాప్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మార్గా గ్యుయల్ సోలెర్, సెడ్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వికాస్ మెహతా, ఇండోనేషియా జాతీయాభివృద్ధి మంత్రి రచ్మట్ పంబుడి, ఇండికా ఎనర్జీ ప్రెసిడెంట్ డైరక్టర్ అర్సాద్ రజీద్, రెన్యు పవర్ జింక్ సిఇఓ వైశాలి నిగమ్ సిన్హా పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2023 ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. అ ఏడాది పూర్వ పారిశ్రామిక సగటు కంటే 1.45°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రీన్ హౌస్ వాయు సాంద్రతలు 2022లో గరిష్టస్థాయికి చేరాయి, ఆ తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది. గత 65సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా సముద్రపు వేడి గరిష్టస్థాయికి చేరింది. 2022-23లో గ్లేసియర్ నష్టం రికార్డుస్థాయికి చేరింది. కేవలం స్విట్జర్లాండ్ లోనే రెండేళ్లలో హిమానీనద పరిమాణం 10% కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పరివర్తన కోసం 2030నాటికి పునరుత్పాదక శక్తి, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి 4ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. 2050నాటికి క్లీన్ హైడ్రోజన్ డిమాండ్ 125 – 585 ఎంటిపిఎ నడుమ ఉంటుంది. అప్పటికి పవర్ మార్కెట్ లో 50 నుంచి 65శాతంతో గ్రీన్ హైడ్రోజన్ పై చేయి సాధిస్తుంది. 2024లో గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ పరిమాణం $6.49 బిలియన్లను అధిగమించింది. 2032నాటికి ఇది సగటున 31శాతం పెరిగే అవకాశం ఉంది.