శతవసంతాల చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
చుక్కా రామయ్య జన్మదినం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినం
స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు
ఐఐటీ విద్యను ప్రజలకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త
ఆయన ఆలోచనలు, సూచనల మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది: సీఎం
CM Revanth Reddy extends birthday wishes to Chukka Ramaiah on his 100th birthday
హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ వైతాళికుడు చుక్కా రామయ్య శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య జన్మదినోత్సవం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో చుక్కా రామయ్య క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఐఐటీ విద్యను ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్తగా ఆయన సేవలను ప్రశంసించారు. విద్యారంగంతో పాటు శాసనమండలి సభ్యుడిగా కూడా ప్రజా సమస్యలపై తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు.
చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి ప్రముఖులతో కలిసి పనిచేసిన అనుభవాన్ని తాను అదృష్టంగా భావిస్తానని సీఎం అన్నారు. శాసనమండలిలో సామాజిక, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా వాటి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు అంశాన్ని మండలిలో ప్రస్తావించి ప్రభుత్వ నిర్ణయానికి కారణమయ్యారని గుర్తుచేశారు.
కాలానికి, రాజకీయాలకు అతీతమైన వ్యక్తిత్వం చుక్కా రామయ్యదని, ఆయన ఆయురారోగ్యాలతో మరింతకాలం అందరికీ స్ఫూర్తినివ్వాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆయన ఆలోచనలు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి తదితరులు చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




