ఏపీ ఎన్నికల రాజకీయంలో షర్మిల సంచలనంగా మారుతున్నారు. అన్నకు వ్యతిరేకంగా షర్మిల తన పార్టీ గెలుపు కోసం ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ పులివెందుల నుంచి ఎన్నికల బరి లోకి దిగారు.
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో వైఎస్ వారసులిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి తల పడటం తో ఇక్కడి రాజకీయం పైన ఆసక్తి కొనసాగుతోంది.
కడప జిల్లాలో ఈ సారి షర్మిల – జగన్ రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్దిగా అవినాశ్ బరిలో నిలిచారు. ఇప్పటికే జగన్, అవినాశ్ లక్ష్యంగా షర్మిల -సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తన అన్న జగన్ పోటీ చేస్తున్న పులివెందుల పైన షర్మిల ఫోకస్ చేసారు. వేంపల్లి నుండి ప్రారంభం షర్మిల బస్సుయాత్ర ప్రారంభం కానుండగా..సింహాద్రిపురం, లింగాల మండలాలతో పాటు పులివెందుల పట్టణంలో ప్రచారం చేయనున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ప్రచారంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, సునీత భర్త రెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
ఇప్పటికే షర్మిల అధికారపార్టీపై తనదైన శైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు. కడప పార్లమెంట్ పరిధిలో షర్మిల ప్రచారం సమయంలో జగన్ పైన చేస్తున్న విమర్శల సమయంలో వైసీపీ అభిమానులు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా ఎవరు బరిలోకి దిగుతారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజు ప్రచార సమయంలో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వివేకా సతీమణి లేదా సునీతను బరిలోకి దింపుతారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే, జగన్ పోటీ చేస్తుండటంతో ఇక్కడ అభ్యర్ది విషయంలో షర్మిల నిర్ణయం కీలకం కానుంది. పులివెందులలో ఈ నెల 22న జగన్ తన ఎన్నికల నామినేషన దాఖలు చేయనున్నారు. పులివెందులలో భారతి ఎన్నికలు పూర్తయ్యే వరకూ ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో, పులివెందులలో చోటు చేసుకొనే రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.