- ఎమ్మెల్యేల స్థాయిలో రచ్చకెక్కుతున్న విభేదాలు
- టికెట్లు ప్రకటించే వేళ పరిణామాలు
- పరిష్కరించకుంటే.. పార్టీకి చేటే అంటున్న విశ్లేషకులు
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మరో వారం పది రోజుల్లో పోటీదారుల జాబితాను సైతం విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్న వేళ.. అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటు, కొట్లాటలు అధిష్టానానికి తలపోటుగా మారుతున్నాయి. రోజు రోజుకీ ఇవి సృతి మించుతుండడంతో.. ఎలా సర్దిచెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం, ముఖ్యంగా గులాబీ కేసీఆర్ తీవ్ర అసహనానికి గురవుతున్నారని సమాచారం. వీటికి వీలైనంత త్వరగా ఫుల్‌స్టాప్ పెట్టకపోతే పార్టీకి ఎన్నికల్లో చేటు తెస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
బజారున పడుతున్న ఎమ్మెల్యేలు
బీఆర్‌ఎస్‌లో నెలకొన్న తాజా అసంతృప్త పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఎమ్మెల్యే స్థాయి నేతలే బజారుకెక్కి కొట్లాడుకోవడం.. క్రమశిక్షణ గల పార్టీగా పేరున్న బీఆర్‌ఎస్‌కు అపప్రదను తీసుకొస్తోంది. కడియం శ్రీహరి, రాజయ్యలు గత కొన్ని రోజులుగా డైలీ సీరియల్ తరహాలో ఒకరికొకరు తిట్టుకోవడం, ఒకరి కుటుంబ విషయాల గురించి ఇంకొకరు మాట్లాడడం… ఇంకా ముందుకెళ్లి.. పుట్టు పూర్వోత్తరాల గురించి విమర్శలు చేయడం.. వారి దిగజారుడు తనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. దీంతో.. బీఆర్‌ఎస్ పార్టీలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని స్థానిక నాయకులు, ఆయా నేతల వర్గీయులు సైతం అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు.
రెడ్యానాయక్.. మరో షాక్
కడియం, రాజయ్యల ఎపిసోడ్ నడుస్తుండగానే.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్.. తాజా వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీసేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఆయన తాజాగా ఓ సభలో మాట్లాడుతూ.. డోర్నకల్ టికెట్‌ను పార్టీ అధినేత కేసీఆర్ తనకే కేటాయించారని చెప్పుకున్నారు. వాస్తవానికి ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయే స్థితిలో ఉందని సిటింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే కష్టమనే అభిప్రాయాలున్నాయి. అంతేకాకుండా.. రెడ్యానాయక్ తాజా ప్రకటనతో.. ఇక్కడ ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్ పరిస్థితి ఏంటనే ప్రశ్న మొదలైంది. అంతేకాకుండా.. రెడ్యా నాయక్ ప్రకటనతో.. సత్యవతి రాథోడ్ అనుచరులు మండలాల స్థాయిలో వైరి వర్గంపై విరుచుకు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మంలోనూ అదే పరిస్థితి
మరోవైపు.. ప్రస్తుతం అందరికీ హాట్ టాపిక్‌గా మారిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌కు అసంతృప్త స్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రేగా కాంతారావు అంటే ఆ పార్టీలో గిట్టని నాయకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఆయన వ్యవహార శైలి, ఇతర నేతలతో పొసగకపోవడం వంటి కారణాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌లోనే రెండు, మూడు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం ఓటమికి మరో వర్గం కృషి చేసేంత తారా స్థాయికి విభేదాలు చేరుకుంటున్నాయి.
మండలాల్లో మరింత ఘోరం
ఎమ్మెల్యేల స్థాయిలోనే పరిస్థితులు ఇలా ఉంటే.. మండలాల స్థాయిలో ఇంకా తీసికట్టుగా పార్టీలో కుమ్ములాటలు జరుగుతున్నాయి. మండల స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, జడ్‌పీటీసీ, ఎంపీటీసీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. అంతేకాకుండా.. ఈ సారి సిటింగ్‌ల స్థానంలో టికెట్ ఆశిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు.. పని కట్టుకుని.. ఎమ్మెల్యేలపై వ్యతిరేక ప్రచారానికి తెరతీస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నోటి మాటగా ఖరారు.. తకరారు
మరోవైపు.. జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న హరీశ్‌రావు, కేటీఆర్‌లు.. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ లభించే నేతల విషయంలో నోటి మాటగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. సదరు నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలు.. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదారి కిశోర్‌కు మళ్లీ టికెట్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ సూచన ప్రాయంగా పేర్కొనడం.. పార్టీలో వ్యతిరేక వర్గాన్ని పెంచుతోంది. అంతేకాకుండా.. గాదారి కిశోర్ గత నెల మాదిగ కులస్థులపై చేసిన వ్యాఖ్యలు ఆ కులంలో బాగా వ్యతిరేకతలను పెంచాయి. వీటిని పరిగణించకుండా.. ప్రకటించడంతో ఆ వర్గం ఓట్లు బీఆర్‌ఎస్‌కు పడవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గ్రేటర్‌లో కూడా
అధికార పార్టీ నేతలు కనుసన్నలలో ఉండే.. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ పార్టీలో వర్గపోరు ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ల నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిత్యం కొట్లాడుకుంటున్నారు. కానీ.. ఈ నేతలు మాత్రం తమ వర్గం వారిని ప్రోత్సహిస్తూ.. వైరి వర్గం వారిని విస్మరిస్తున్నారని, సమస్య పరిష్కారం బదులు పెరిగేలా వారి ధోరణి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో.. నిత్యం అధినేత కేసీఆర్ దృష్టిలో ఉండే.. గ్రేటర్‌లోనే పరిస్థితులు చక్కబెట్టకపోతే.. జిల్లాల్లో ఎలా పరిష్కారం అవుతాయనే ప్రశ్న తలెత్తుతోంది.
లిస్ట్ వచ్చాక.. మరింత అలజడి
గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచన ప్రకారం.. ఈ నెల 15వ తేదీన 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలతో తొలి జాబితా విడుదల చేయనున్నారు. దీంతో.. ఆ జాబితాలో చోటు లభించని సిటింగ్‌లు, టికెట్ ఆశావాహులు.. నియోజకవర్గాల్లో మరింత అలజడికి కారణమవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు టికెట్ రాకపోయినా.. తన ప్రత్యర్థికి టికెట్ వస్తే తట్టుకోలేని విధంగా నేతల అంతర్గతం ఉంటుందని అలాంటి వారు కలహాలకు కాలు దువ్వుతారనే విశ్లేషణలు మొదలయ్యాయి.
అధినేత.. జోక్యం చేసుకుంటేనే
పార్టీలో ఈ స్థాయిలో కుమ్ములాటలు, కలహాలు జరుగుతున్న నేపథ్యంలో.. గులాబీ బాస్ కేసీఆర్ ట్రబుల్ షూటింగ్ చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేను చెప్పిందే వేదం అనే విధంగా బాస్ వైఖరి ఉంటే.. దాన్ని పాటించే నేతలు ఇప్పుడు లేరని.. గత పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తూ.. టికెట్ ఆశిస్తున్న వారు టికెట్ రాకపోతే సహనం కోల్పోతారని.. ఈ విషయాన్ని కేసీఆర్ గ్రహించి వారికి తగిన హామీ ఇస్తేనే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే.. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచే ప్రాంతీయ పార్టీలో.. అందులోనూ కేసీఆర్ మాటకు ఎదురు లేదనే సాగిన బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు తారుమారవడం చర్చనీయాంశంగా మారింది.


