కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల మండిపాటు
సుస్మిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం.. రేవంత్‌కు అండగా ఉంటామన్న ఎమ్మెల్యేలు
Furious over Susmitha’s comments… MLAs pledge support to Revanth.

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలను సహించబోమని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి బహిష్కరించే పరిస్థితి రాకముందే కొండా సురేఖ స్వచ్ఛందంగా పార్టీని వీడాలని డిమాండ్ చేశారు. పార్టీలోనే కొందరు వ్యక్తులు కొండా సురేఖకు మద్దతుగా ఉంటూ అంతర్గత విభేదాలకు కారణమవుతున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పదేపదే విమర్శలు చేయడం సరికాదని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. తమను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నాయకత్వానికి కాంగ్రెస్ శ్రేణులు అండగా ఉన్నాయని స్పష్టం చేశారు.
సీఎంకు అండగా ఉంటాం: బీర్ల ఐలయ్య
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అండగా ఉన్నారని తెలిపారు. గతంలో నటి సమంత విషయంలోనూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రిపై ఎవరైనా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీర్ల ఐలయ్య హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
రేవంత్ నిర్ణయాలను వ్యతిరేకిస్తే పార్టీలో ఉండే అర్హత లేదు: వేముల
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కొండా సురేఖపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించే వారికి పార్టీలో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ పార్టీకి వివరణ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సంబంధం లేకపోతే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను మంత్రి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
తప్పుడు భాష, వ్యక్తిగత విమర్శల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు నష్టం జరుగుతోందని వేముల వీరేశం విమర్శించారు.
పరకాల టికెట్ అంశంతో మొదలైన వివాదం
ఇటీవల పరకాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో పరకాల నుంచి రేవూరికే మరోసారి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందనే రాజకీయ చర్చ మొదలైంది.
ఈ పరిణామం అనంతరం గీసుకొండలో జరిగిన కార్యక్రమంలో సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తానని ఆమె ప్రకటించినట్లు సమాచారం.
మంత్రి సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసు
సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ తన కుమార్తె చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని పార్టీకి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా స్పందించడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఒకవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు, మరోవైపు ఎమ్మెల్యేల బహిరంగ విమర్శల నేపథ్యంలో కొండా కుటుంబం వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా వచ్చిన విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.




