భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు
ముగ్గురు నిందితుల అరెస్ట్.. లక్నోలో అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందం
Karimnagar police crack major investment fraud case.
కరీంనగర్: కరీంనగర్‌లో భారీ స్థాయిలో జరిగిన పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. పెట్టుబడి పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించి కోట్లాది రూపాయలు సేకరించి మోసానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్‌తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్థాపించిన సంస్థ ద్వారా వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టారు. తక్కువ కాలంలో పెట్టుబడులు రెండింతలు, మూడింతలు అవుతాయని నమ్మబలికి ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. నెట్‌వర్క్ చైన్ విధానంలో కొత్త పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మొత్తాలతో పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తూ మరింత మందిని పెట్టుబడుల వైపు ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు.
కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొంతకాలం పాటు చెల్లింపులు చేసిన అనంతరం 2024 మే నుంచి చెల్లింపులను నిలిపివేసి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
లక్నోలో అరెస్ట్
ఈ వ్యవహారంపై బాధితుడు గుగులోత్ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కేసును సీసీఎస్ కరీంనగర్‌కు బదిలీ చేశారు.
సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లింది. సెప్టెంబర్ 18, 2026 రాత్రి లక్నోలోని నిందితుల నివాసాల్లో హేమంత్ కుమార్ రాయ్, రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితులను లక్నోలోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు.
పోలీసు బృందానికి అభినందనలు
కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాశ్ గౌడ్, ఎస్సై డి. మహిపాల్ రెడ్డి, పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు.




