ధరణిని కొనసాగిస్తున్నారా? లేదా?
🔶ప్రభుత్వ నిర్ణయం చెప్పాలన్న హైకోర్టు
🔷నాలుగు వారాల గడువు కోరిన ఏజీ
🔶ఫిబ్రవరి 2వ తేదీకి విచారణ వాయిదా
🍥ఈనాడు, హైదరాబాద్: ఏకకాలంలో భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తో పాటు హక్కుల్లో స్పష్టత తీసుకురావాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’ని కొనసాగిస్తున్నారా? లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ముందున్న పిటిషన్‌లను పరిష్కరిస్తామంది. దీనిపై నూతన అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డిని వివరణ ఇవ్వాలంది. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి 4 వారాల గడువు కావాలని ఏజీ అడగడంతో విచారణ వాయిదా పడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో వివిధ సర్వే నంబర్లలోని 146.05 ఎకరాలకు చెందిన వివిధ విక్రయ దస్తావేజుల సర్టిఫైడ్ కాపీలను గండిపేట తహసీల్దారు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన వై.జైహింద్‌రెడ్డితో పాటు మరికొందరు ధరణిలో ఎదురవుతున్న సమస్యలపై పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ గత ఏడాది ఏప్రిల్‌లో విచారణ చేపట్టడంతో పాటు భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)ను కోర్టుకు పిలిపించి పలు సందేహాలపై వివరణ కోరారు. కోర్టుకు వస్తున్న పిటిషన్‌ల ఆధారంగా ధరణిలో 20 దాకా ప్రధాన సమస్యలున్నాయని గుర్తించారు. అవి..
🌀నిర్దిష్ట గడువులోగా ఈ-పట్టాదారు పాస్‌బుక్‌లో సవరణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించకపోవడం, సర్వే నిమిత్తం ఎఫ్-లైన్ దరఖాస్తులను తీసుకోకపోవడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన ఆస్తులకు విక్రయ దస్తావేజులను జారీ చేయకపోవడం, ధరణి పోర్టల్‌లో ఉన్న జీపీఏలను రిజిస్ట్రేషన్ సమయంలో పట్టించుకోకపోవడం వంటి సమస్యలున్నాయని గుర్తించారు. ఎలాంటి కారణాలు పేర్కొనకుండా ఎఫ్-లైన్ దరఖాస్తులను, తిరస్కరించడం, కోర్టు డిక్రీలో టైటిల్ మార్పుపై స్పష్టత లేకపోవడం, ఇందుకు పరిమితులు లేకపోవడం, ఇతర విధానాల్లో దరఖాస్తులు వచ్చినపుడు, రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అప్పీళ్లకు, రివిజన్ నిమిత్తం నిబంధనలు లేవు. వీటన్నింటితోపాటు గ్రామ, మండల స్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సాధారణ ఇబ్బందులపై అభిప్రాయాలను కలెక్టర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరించాలని సీసీఎల్‌ఏకు గత ఏడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించిన అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల అమలుపై నివేదిక నిమిత్తం శుక్రవారం న్యాయమూర్తి మరోసారి విచారణ చేపట్టారు. సమస్యల పరిష్కారంలో మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేసినట్లుగా ఎలాంటి నివేదిక అందలేదు. దీంతో కొత్త ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను కొనసాగిస్తుందో లేదో చెప్పాలంటూ అడ్వొకేట్ జనరల్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై ఏజీ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అయితే ధరణి కొనసాగింపునకు సంబంధించి నిర్ణయం చెప్పడానికి 4 వారాల గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేశారు.