రీసర్వేతో దిద్దుబాటు చర్యలా…
హైదరాబాద్, ఫిబ్రవరి 14, (వాయిస్ టుడే )
Corrective action with resurvey...
తెలంగాణలో కొద్ది రోజులుగా కుల గణన రచ్చ సాగుతోంది. స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు చెలరేగాయి. బీసీ కుల గణన చేసిన విధానం దేశంలో తెలంగాణ ఆదర్శమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. కానీ అందుకు తగ్గట్టుగా కుల గణన జరగలేదని తేలిపోయింది. కేసీఆర్ సర్కార్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు, రేవంత్ సర్కార్ చేసిన సర్వేకు మధ్య తేడాలు చర్చాంశనీయంగా మారాయి. 1931లో బ్రిటీష్ పాలకులు చేసిన కుల గణన సర్వే తర్వాత భారత దేశంలో కుల గణన సర్వే జరగలేదు. ఆ గణన ఆధారంగానే దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. 75 సంవత్సరాల తర్వాత బిహార్‌లో 2021లో కుల గణన జరిగింది. అది జరిగిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఇచ్చిన హమీ మేరకు రేవంత్ ప్రభుత్వం బీసీ కులగణనకు పచ్చ జెండా ఊపింది. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క సభ్యులుగా మంత్రి వర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 160 కోట్లతో శాస్త్రీయంగా సర్వే నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే కోసం 1 లక్షా 3 వేల 889 మంది ఎన్యుమరేటర్లను వినియోగించారు. 1,15, 71, 457 కుటుంబాలను తెలంగాణలో గుర్తించగా ఎన్యుమరేటర్లు 1,12,15,134 కుటుంబాలను సర్వే చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ కారణాలతో 3,56,323 కుటుంబాలను సర్వే చేయలేదు. తెలంగాణలో 96.9 శాతం సర్వే కవర్ అయినట్లు 3.1 శాతం సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం ప్రకటించింది. 2024 నవంబర్ ఆరున సర్వే ప్రారంభించి, 2025 డిసెంబర్ 25వ తేదీతో సర్వేను ముగించారు.
ఈ సర్వేలో తెలంగాణ కులాల శాతం పరిశీలిస్తే..
ఎస్టీల జనాభా శాతం – 10.45
ఎస్సీల జనాభా శాతం – 17.43
మొత్తం ఓసీల జనాభా శాతం – 15.79
ముస్లిం మైనార్టీల జనాభా శాతం – 12.56
ముస్లిం మైనార్టీలలో ఓసీ జనాభా శాతం – 2.48 శాతం
బీసీల జనాభా శాతం – 46.25 శాతం
ముస్లిం మైనార్టీలలో బీసీల శాతం – 10.08 శాతం
ముస్లిం మైనార్టీలు, బీసీలు కలుపుకుని మొత్తం జనాభా శాతం – 56.33
2014 నుంచి పదేళ్లలో అంటే ఈ ఏడాది 2024 వరకు చూస్తే బీసీలు, ఎస్సీ, ముస్లిం జనాభా తగ్గినట్లు, ఓసీ జనాభా మాత్రం పెరిగినట్లు రేవంత్ సర్కార్ చేసిన కుల గణన తేల్చింది. దీనిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుల గణన సర్వే కాగితాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ,ఎస్సీ నేతలు సైతం దీనిపై గుర్రుగా ఉన్నారు. ఓసీ జనాభా మాత్రమే ఎందుకు పెరిగింది , మిగతా సామాజిక వర్గాల జనాభా ఎలా తగ్గుతుంది. ఇదంతా ఓ కుట్ర లా జరిగిందన్న విమర్శలు వచ్చాయి. దీనికి సరైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలది. ఈ కుట్ర కోణం వెనుక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఉన్నారన్న చర్చ కాంగ్రెస్‌లో సాగింది. బీసీలకు అవకాశాలు లేకుండా చేసేందుకు ఓ వర్గం వారు కుట్ర పన్నారన్న ఆరోపణలు వచ్చాయి. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాంగ్రెస్‌ను ఈ విషయంలో టార్గెట్ చేస్తూ తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముస్లిం మైనార్టీలకు లబ్ధి చేకూరేలా బీసీ జనాభా తగ్గించి మైనార్టీ సంఖ్య పెంచి చూపించాలని చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభాతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన సర్వేలో ఎలా తగ్గిందని ప్రశ్నలు గుప్పించారు. తిరిగి రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై హరీశ్ రావు, కేటీఆర్ ఎందుకు సర్వేలో పాల్గొన లేదని రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు కౌంటర్ ఎటాక్ చేశారు. ఇలా కుల గణన విషయంలో కాంగ్రెస్ సర్కార్ డిఫెన్స్‌లో పడింది. ఇది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలిస్తే దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన జరిపి తీరతామని రాహుల్ గాంధీ ఇచ్చిన హమీ. ఆ హామీ మేరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు బీసీల జనాభా తగ్గించి చూయించిననట్లు విస్తృత ప్రచారం జరుగుతుండటంతో ఆ వార్త పార్టీ హైకమాండ్ వరకు చేరిందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇటు బీసీ కుల గణన రచ్చ, మరోవైపు ఎస్సీ వర్గకరణ విషయంలోను ఎమ్మార్పీఎస్ మందకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు విషయాలు కాంగ్రెస్ పార్టీ కంట్లో నలుసుగా మారాయి. ఈ వివాదాలు నడుస్తుండగానే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయింది. అందుకు రాష్ట్రంలోని ఈ పరిస్థితులే కారణమన్న చర్చ హస్తం నేతల్లో నడుస్తోంది. ఇటు ఎస్సీ వర్గీకరణ, అటు బీసీ కుల గణన ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనుకుంటే ఆ వ్యూహం బూమ్ రాంగ్ అయ్యే పరిస్థితి కలిగింది. దీంతో రేవంత్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇటీవలే జరిగిన మందకృష్ణ మాదిగతో రేవంత్ భేటీ అందులో భాగమని తెలుస్తోంది. మరోవైపు బీసీల ఆగ్రహాన్ని చల్చార్చేందుకు మరో దఫా కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల16 నుంచి 28వ తేదీ వరకు మరోమారు కులగణన చేయనున్నారు. అయితే 3.1 శాతం మంది ఈ గణనలో పాల్గొనలేదు. వారి కోసం ఇది చేపడుతున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.