- Advertisement -
ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి: ఆర్జీ-3 జి.యం
Cost of production to be reduced: RG-3 GMకమాన్ పూర్
ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు అన్నారు.
సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తునటువంటి మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలలో భాగంగా ఆర్జీ-3 ఏరియాలోని ఓ.సి-1 ఉపరితలగని సైట్ ఆఫీస్ నందు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాన్ని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడానికి, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి, భద్రతతో కూడిన ఉత్పత్తిని సాధించడానికి కృషి చేయాలని అన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని, కావున ఎవరి స్థాయిలో వారు సాధ్యమైనంత వరకు వ్యయాన్ని తగ్గించుకోవాలని కోరారు. అంతే కాకుండా నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, అంకిత భావంతో పని చేయాలని అన్నారు. భద్రత పట్ల అశ్రద్ధ వహించకుండా అధికారులు, సూపర్వైజర్లు సంబంధిత ఉద్యోగులకు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి సక్రమంగా పని చేస్తూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఏ ఇతర ప్రభుత్వ సంస్థలో లేని విధంగా సింగరేణి సంస్థలో ఉద్యోగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కావున ఉద్యోగులందరూ దీనిని గమనించి, సమిష్టి కృషితో నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచుతూ సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రూపొందించే ప్రణాళికలకు అనుగుణంగా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. సంస్థ పై వినియోగదారుడు పెట్టుకున్న నమ్మకాని వమ్ము చేయకుండా చూడటం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ సమావేశంలో భాగంగా సింగరేణి సాధిస్తున్నటువంటి ప్రగతి, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడానికి చేసినటువంటి ప్రణాళికల గురించి సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. దీనిలో భాగంగా సంస్థ అభివృద్ధికి సంబంధించి పలువురు ఉద్యోగులు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలను సంబంధిత అధికారులు స్వీకరించారు.
కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు వై.వి.రావు, డి.టి.రావు, జి.వెంకటస్వామి, ఏరియా ఇంజనీర్ వై.వి.శేఖరబాబు, ఎస్వోటుజియం జి.రఘుపతి, ఫైనాన్స్ ఎజియం పి.శ్రీనివాసులు, ఐఈ డిజిఎం కె.చంద్రశేఖర్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్, మేనేజర్ ఉదయ్ హరిజన్, డివైపియం వి.సునీల్ ప్రసాద్, సంక్షేమ అధికారి సాయి కృష్ణ, ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




