80 కోట్ల ఆస్తులున్నా… సాదారణ జీవితం
Despite having assets worth ₹80 crore… a simple life.
ముంబై, అక్టోబరు 8
విలక్షణ నటనతో భారతీయ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో ఈ ఉదయం తీవ్రమైన గుండెపోటుకు గురై ఆయన తుదిశ్వాస విడిచారు. నానా పటేకర్ అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోవడంతో ఆయన్ను వెంటనే పనాజీలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గోవా మెడికల్ కాలేజీకి తరలించారు.దాదాపు ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో నానా పటేకర్ రూ. 50 నుంచి 80 కోట్ల ఆస్తులు సంపాదించినప్పటికీ, అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ముంబైలో ఒక సాధారణ 1BHK ఫ్లాట్‌లోనే నివసించారు. రైతుల కష్టాలను చూసి చలించిపోయిన ఆయన ‘నామ్ ఫౌండేషన్’ స్థాపించి వేలాది రైతు కుటుంబాలకు అండగా నిలిచారు.నానా పటేకర్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పుణె సమీపంలోని ఖడక్‌వాస్లాలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
పొడి కట్టెలతో కాల్చాలని వినతి
వైరల్ గా మారిన కామెంట్
ప్రముఖ విలక్షణ నటుడు నానా పటేకర్ (75) గోవాలోని తన నివాసంలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన మరణవార్తతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషాద సమయంలో ఆయన తన మరణం, దహన సంస్కారాల గురించి గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితం పట్లనే కాకుండా మరణం పట్ల కూడా ఆయనకున్న నిర్మొహమాటమైన, విలక్షణమైన వైఖరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.2023 సెప్టెంబర్ లో ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నానా పటేకర్ మరణంపై తన తాత్విక ఆలోచనలను పంచుకున్నారు. తన దహన సంస్కారాల కోసం 12 మణుగుల (సుమారు 480 కేజీలు) కట్టెలను తాను ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నానని ఆయన ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “నాకు 12 మణుగుల కట్టెలు అవసరమవుతాయని నాకు తెలుసు. అదే నా చివరి ఆస్తి. దానితోనే నేను వెళ్లిపోతాను” అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు తన దహనానికి ఎండిన కట్టెలను మాత్రమే వాడాలని ఆయన స్పష్టంగా కోరారు. “నేను నా 12 మణుగుల కట్టెలను సిద్ధంగా ఉంచాను. అవి బాగా ఎండిపోయాయి. వాటితోనే నన్ను దహనం చేయండి. దయచేసి తడి కట్టెలను అస్సలు ఉపయోగించవద్దు” అని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి గల కారణాన్ని కూడా ఆయన చాలా విభిన్నంగా వివరించారు. తడి కట్టెలు వాడితే వచ్చే పొగ వల్ల అక్కడ ఉన్నవారి కళ్లలో నీళ్లు వస్తాయని, అది చూసి తన కోసం వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అపోహ పడే అవకాశం ఉంటుందని అన్నారు. తన మరణ సమయంలో అలాంటి గందరగోళం ఉండకూడదని, తన కోసం ఎవరూ ఏడ్చినట్లు భ్రమ కలగకూడదని ఆయన బలంగా ఆకాంక్షించారు.భౌతిక ఆస్తులు, సంపదలు అశాశ్వతమని, మరణం అనేది జీవితంలో ఒక కఠిన వాస్తవమని తాను నమ్ముతానని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. మరణాన్ని కూడా ఇంత నిర్లిప్తంగా, తాత్వికంగా స్వీకరించిన నానా పటేకర్ వైఖరి ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోందని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
పన్నులు కట్టే వాళ్లను వేధిస్తారా
ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణ వార్తల నేపథ్యంలో, ఆయన గతంలో రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసిన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2022లో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో సామాన్యులు పన్నులు కడుతున్నా వేధింపులకు గురవుతున్నారని, కానీ అవినీతిపరులైన రాజకీయ నాయకులు మాత్రం తప్పించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన నిర్భీతికి, సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.వివరాల్లోకి వెళితే.. 2022లో జరిగిన ‘లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల ప్రదానోత్సవానికి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన నానా పటేకర్, వారిని సూటిగా ప్రశ్నించారు. “మనం రూ.100 సంపాదిస్తే, అందులో రూ.30 ఆదాయపు పన్నుగా చెల్లిస్తాం. దానితో పాటు 18 శాతం జీఎస్టీ కూడా కడతాం. ఇంత పన్ను కట్టిన తర్వాత కూడా సామాన్యులపై విచారణలు, దర్యాప్తులు జరుగుతాయి. మరి వేల కోట్లు దోచుకుంటున్న అవినీతి రాజకీయ నాయకులను ఎందుకు విచారించడం లేదు?” అని ఆయన నిలదీశారు. కొందరు ప్రజా ప్రతినిధులు ఎన్నికైన కొద్దికాలంలోనే విపరీతంగా ఆస్తులు ఎలా కూడబెడుతున్నారని ప్రశ్నిస్తూ, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నానా పటేకర్ ప్రశ్నలకు దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ సమాధానమిచ్చారు. అవినీతి అనేది ఒక వ్యవస్థాగత సమస్య అని, దాన్ని నిర్మూలించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. కొన్నిసార్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారినే ప్రజలు మళ్లీ ఎన్నుకుంటున్నారని, సమాజం మంచి, చెడుల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.నానా పటేకర్ ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఈ పాత సంభాషణ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారిని సైతం ప్రజా సమస్యలపై సూటిగా ప్రశ్నించిన ఆయన వ్యక్తిత్వాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రశంసిస్తున్నారు.
కారు కొనడం మానేసి రైతులకు చెక్కులు
నానా పటేకర్ కేవలం గొప్ప నటుడే కాదు, అంతకుమించిన గొప్ప మానవతావాది. ఆయన సేవా గుణం గురించి ఇటీవలే ప్రముఖ రచయిత, నటుడు రణబీర్ పుష్ప్ ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. రైతుల ఆత్మహత్యల గురించి వార్తల్లో చూసి నానా తీవ్రంగా చలించిపోయారని గుర్తుచేసుకున్నారు. “మరుసటి రోజు ఆయన రూ.1.5 కోట్ల విలువైన కారు కొనాల్సి ఉంది. కానీ, రైతు కుటుంబాల కష్టాలు చూసి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. వెంటనే ఆ మొత్తాన్ని రూ.15,000 చొప్పున చెక్కులుగా మార్చి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పంపిణీ చేయమని చెప్పారు. నామ్ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమందికి అండగా నిలిచారు” అని రణబీర్ వివరించారు.నానా పటేకర్ కోపం గురించి వస్తున్న వదంతులను కూడా రణబీర్ పుష్ప్ ఖండించారు. ఆయన కోపం వెనుక సామాజిక బాధ్యత ఉంటుందన్నారు. ఓసారి రోడ్డుపై బాటిల్ విసిరేసిన వ్యక్తిని నానా నిలదీసిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. “గాంధీజీ పోయారు, కానీ మీరింకా భూమ్మీద ఉన్నారు కదా? ఈ దేశాన్ని శుభ్రంగా ఉంచడం మీ బాధ్యత కాదా? ఈ బాటిల్‌ను మీ కారులోనే చెత్తబుట్ట అనుకుని వేయమంటారా?” అని ఆ వ్యక్తిని సున్నితంగా మందలించారని తెలిపారు. అగ్ని సాక్షి’ సినిమాకు రణబీర్ రచయితగా పనిచేయగా, నానా పటేకర్ కథానాయకుడిగా నటించారు. నానా మృతితో భారతీయ సినిమా ఓ గొప్ప నటుడిని, సమాజం ఓ ఆదర్శవంతమైన వ్యక్తిని కోల్పోయింది.
క్రికెటర్ల ఘన నివాళి
నానా పటేకర్ ఆకస్మిక మరణం పట్ల భారత క్రికెట్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ సంతాపం ప్రకటించాడు. “భారతీయ సినిమా ఈరోజు నిజమైన ప్రత్యేక ప్రతిభను కోల్పోయింది. నానా పటేకర్ సాబ్.. మీ నటన తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఓం శాంతి” అని ధావన్ పేర్కొన్నాడు. మరోవైపు భారత సీనియర్ టెస్ట్ బ్యాటర్ అజింక్యా రహానే సైతం నివాళులు అర్పించాడు. “నానా పటేకర్ జీ ఎన్నో తరాలను అలరించి, స్ఫూర్తిని నింపిన అసాధారణమైన నటుడు. ఆయన మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి” అని రహానే తెలిపాడు.
ఆఖరి రోజుల వరకు నటనపై మక్కువ.. కీలక చిత్రాల్లో పాత్రలు
75 ఏళ్ల వయసులోనూ నానా పటేకర్ వరుస ప్రాజెక్టులతో వెండితెరపై కొనసాగారు. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘హౌస్‌ఫుల్ 5’లో భాగమయ్యారు. అలాగే విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి జంటగా నటించిన ‘ఓ రోమియో’ చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా మెప్పించారు. అనిల్ కపూర్, రాధికా మదన్ నటించిన ‘సుబేదార్’ మూవీలోనూ ఆయన ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు.
భారతీయ సినిమాకు తీరని లోటు.. అద్భుత ప్రస్థానానికి ముగింపు
సహజమైన డైలాగ్ డెలివరీ, అద్భుతమైన హావభావాలతో ఐదు దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నానా పటేకర్ నిష్క్రమణతో భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక విశిష్ట శకం ముగిసింది.




