- Advertisement -
ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్
Digital arrest in Khammam
ఖమ్మం, డిసెంబర్ 23, (వాయిస్ టుడే)
దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులనే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. గాలమేసి డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ మధ్య డిజిటల్ అరెస్టు అంటూ చెలరేగిపోతున్నారు. బాధితులకు లక్షల్లో కుచ్చిటోపి పెడుతున్నారు. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. తెలంగాణలో డిజిటల్ అరెస్ట్ వెలుగులోకి వచ్చింది. ఓ బాధితుడు కేటుగాళ్ల వలలో పడి సుమారు రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఓ వ్యక్తికి సైబర్ కేటుగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ పేరు మీద శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వేర్వేరు ప్రాంతాలకు ఐదు టికెట్లు బుక్ అయ్యాయని బాధితుడికి అవతల వ్యక్తి తెలిపాడు. అంతేకాకుండా ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాలకు టికెట్ ఎందుకు బుక్ చేసుకున్నారంటూ వరుస ప్రశ్నలు అడిగాడు. అయితే తాను ఎక్కడికీ టికెట్ బుక్ చేయలేదని బాధితుడు చెప్పాడు. అనంతరం ఆ కేటుగాడు బాధితుడి వాట్సాప్ నెంబర్‌కు వీడియో కాల్ చేశాడు. తాము సీబీఐ అధికారులమంటూ వీడియో కాల్ ద్వారా బాధితున్ని నమ్మించాడు. ఆపై మీ పేరు మీద ఢిల్లీలో అకౌంట్ ఉందని హవాళా, మనీ లాండరింగ్, డ్రగ్స్ లావాదేవీలన్నీ సదరు అకౌంట్ నుంచి జరుగుతున్నట్లు గుర్తించామని సైబర్ నేరగాళ్లు బాధితుడికి చెప్పి భయపెట్టారు. అక్కడితో ఆగకుండా ఇదే కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని సైతం అరెస్ట్ చేశామని మరింత చెమటలు పట్టించారు. అరెస్టు చేసిన వ్యక్తి వద్ద నుంచి లభించిన కీలక డాక్యుమెంట్స్ ఆధారంగా మిమ్మల్ని విచారిస్తున్నామని బాధితుడిని వణికించారు. సదరు కేసు రిపోర్ట్స్ ను కూడా వాట్సాప్ లో పంపించి బాధితుడిని భయాందోళనకు గురిచేశారు. అలాగే ఈ విషయాన్ని బాధితుడు ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని ఈ కేసు వివరాలను బయటికి వెల్లడిస్తే తక్షణమే అదుపులోకి తీసుకుంటామంటూ బెదిరించారు. బాధితుడి పేరు మీద సుప్రీం ధర్మాసనం అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని నేరగాళ్లు భయాందోళనకు గురిచేశారు. దీంతో బాధితుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్పందించాడు. తాను ఏ తప్పూ చేయలేదని తనను కాపాడాలని అధికారుల ముసుగులో ఉన్న సైబర్ నేరగాళ్లను వేడుకున్నాడు. ఇక ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు.. తాము చెప్పిన విధంగా చేస్తే కేసు నుంచి తప్పించుకోవచ్చని బాధితున్ని నమ్మించారు. మొదట బాధితుడి బ్యాంకు అకౌంట్, బ్యాలెన్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తదనంతరం ఉన్నతాధికారులను మ్యానేజ్ చేయడానికి.. కేసు ఉపసంహరించుకోవడానికి రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో వెంటనే నేరగాళ్లు అడిగిన రూ.15లక్షలు నగదును బాధితుడు వారి అకౌంట్లకు ట్రాన్సఫర్ చేశాడు. అక్కడితో నేరగాళ్లు ఆగలేదు. బాధితుడి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను సైతం విత్ డ్రా చేయించారు. ఇక సరిగ్గా అదే సమయంలో బాధితుడి ఇంటికి బంధువులు రావడంతో విషయం తెలిసింది. వెంటనే అప్రమత్తమై పోలీసులను సంప్రదించారు. దీనిపై ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఏడాది 274 కోట్లు…
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలకు గురైన బాధితులు రూ.297 కోట్లు పోగొట్టుకున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. చాలామంది పరువు పోతుందని ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డయల్ 100కి వస్తున్న ఫిర్యాదులపై స్పందన పెరిగింది. ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఘటనాస్థలానికి వెళ్లే సమయం కూడా బాగా తగ్గింది. రాత్రిపూట కూడా పోలీసుల గస్తీ పెంచాం. ధ్వని కాలుష్యంపై తాము తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు వస్తోంది. డిజే సౌండ్‌లపై పలుసార్లు కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఈసారి 45 శాతం ఎఫ్‌ఐఆర్‌లు పెరిగాయి. పెరిగిన వాటిలో చిన్నచిన్న చోరీలు, యాక్సిడెంట్ కేసులున్నాయి. గతంలో చిన్న ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యేది కాదు. ఇప్పుడు ప్రతీ చిన్న నేరానికి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అందుకే కేసుల సంఖ్య పెరిగింది. ఇక కిడ్నాప్ కేసులు 85 శాతం పెరిగాయి. సెల్‌ఫోన్ల చోరీల సంఖ్య కూడా పెరిగింది. సైబర్ నేరాల వలలో పటి కేటుగాళ్ల చేతిలో డబ్బు పోగొట్టుకున్నవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా కూడా మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టు అనగానే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో కూడా చాలామంది మోసపోతున్నారు.గతేడాది కంటే ఈసారి 91 శాతం ఎక్కువగా డబ్బులు పోగొట్టుకున్నారు. కరెంట్ ఖాతాల నుంచే సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. ఎలాంటి విచారణ లేకుండానే కొందరికి బ్యాంక్ సిబ్బంది కరెంట్ ఖాతాలు ఇస్తున్నారు. అంతేకాదు కొందరు బ్యాంకు సిబ్బంది సైబర్ నేరగాళ్లుకు కూడా సహకరిస్తున్నారని” సీవీ ఆనంద్ చెప్పారు.
- Advertisement -