వర్చువల్ క్లాస్ రూం ఏర్పాటు కోసం భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
District Collector P.Ranjit Basha inspected building for setting up virtual room
కర్నూలు
నగరం లోని సంకల్ బాగ్ లో ఉన్న మున్సిపల్ బిల్డింగ్ లో వర్చువల్ క్లాస్ రూమ్ ఏర్పాటును జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు.
ఆదివారం డిఇఓ శామ్యూల్ పాల్ , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రవీంద్ర బాబు తో కలసి కలెక్టర్ వర్చువల్ క్లాస్ రూం ఏర్పాటు కోసం భవనాన్ని పరిశీలించారు.. కలెక్టరేట్ లోని డీఈవో కార్యాలయం లో పదవతరగతి విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వర్చువల్ క్లాస్ రూం చిన్నదిగా ఉండడంతో విశాలమైన భవనంలో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో నగరం లోని సంకల్ బాగ్ లో ఉన్న మున్సిపల్ భవనాన్ని పరిశీలించారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ప్రతి ఒక్కరికీ వర్చువల్ తరగతులు నిర్వహించేందుకు స్టూడియో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా పదవతరగతి విద్యార్థులకు వర్చువల్ తరగతులు నిర్వహించడం జరుగుతోందని, ప్రతి పాఠశాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించి, విద్యార్థులకు పాఠాలు బోధించడం జరుగుతుందన్నారు..మున్సిపల్ భవనాన్ని పరిశీలించిన అనంతరం, ఇంకా మెరుగైన వసతులు కలిగిన భవనం కార్పొరేషన్ పరిధిలో ఉంటే రెండు, మూడు రోజుల్లో పరిశీలించి తెలియచేయాలని కలెక్టర్ డీఈఓను, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ తుంగభద్ర నదీ తీర ప్రాంతాన్ని పరిశీలించారు. నదీ తీర ప్రాంతాల పరిశుభ్రత, సుందరీకరణ పై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుకు సూచనలు ఇచ్చారు. అనంతరం హరహరి క్షేత్రం లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సి.చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలెక్టర్ గారికి స్వాగతం పలికారు.