Sunday, September 8, 2024

ఎమ్మెల్యే లకు కొత్త కార్లు కొనుగోలు చేయం: మిజోరం సీఎం

- Advertisement -

ఆయిజోల్‌: మిజోరం నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ (ZPM) అధ్యక్షుడు లాల్‌దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఎమ్మెల్యేలకుగానీ, మంత్రులకుగానీ కొత్త కార్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయించారు. కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృథా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత మంత్రులు, ఎమ్మెల్యేలు వాడిన వాహనాలనే కొనసాగించాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు కల్పించిన సౌకర్యాలతో పోలిస్తే దాదాపు 50 శాతం మేర తగ్గించుకుంటామని చెప్పారు. మిజోరం ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చాలని, అందుకు కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు పూర్తి స్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పసుపు, చెరుకు, మిరప, వెదురు తదితర స్థానిక ఉత్పత్తులకు కనీస మద్దతుధర చెల్లించి రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని లాల్‌దుహోమా తెలిపారు. ప్రభుత్వానికే విక్రయించాలన్న షరతులేమీ లేవని, ప్రైవేటు వ్యక్తులెవరైనా ఎక్కువ ధర చెల్లిస్తే వారికైనా అమ్ముకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం 12 ప్రాధామ్యాలను గుర్తించినట్లు చెప్పిన సీఎం.. వాటిని నెరవేర్చేందుకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ప్రభుత్వంతోపాటు గుర్తింపు పొందిన పార్టీ నాయకులు, ఎన్జీవోలు, మత సంఘాలకు, మిజోరం పీపుల్స్‌ ఫోరానికి చెందిన సభ్యులు కూడా భాగస్వాములుగా ఉంటారని చెప్పారు. పొదుపు చర్యలు, పెట్టుబడుల ఉపసంహరణ, విద్యుత్ సరఫరా తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని అన్నారు.
జడ్‌పీఎం విధివిధానాలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించాలని అన్ని శాఖల అధికారులకు సీఎం లాల్‌దుహోమా ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖలకు చెందిన మంత్రులు దీనిని పర్యవేక్షించాలని సూచించారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్న లాల్‌దుహోమా.. రాష్ట్రంలో ఇప్పటికే నమోదైన అవినీతి కేసులపై సీబీఐతో విచారణ జరిపిస్తానన్నారు.  మరోవైపు గత ప్రభుత్వాలు ఆమోదం తెలిపిన కాంట్రాక్టు పనులు ఇప్పటికే ప్రారంభమైతే.. కాంట్రాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యధావిధిగా పనులు కొనసాగించవచ్చని చెప్పారు. అయితే, ప్రాజెక్టుల్లో నాణ్యత లోపిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, సిబ్బంది హాజరుశాతాన్ని మెరుగుపరిచేందుకు బయోమెట్రిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. లాల్‌దుహోమాతోపాటు మరో 11 మంది శుక్రవారం మిజోరం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్