బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే ప్రజా సంక్షేమ పథకాలు అమలు
మీ ఆశీర్వాదంతో భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తా
కార్నర్ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని: సమాజంలో అబద్దాలే రాజ్యమేలుతున్నాయని, మోసగాళ్లే నీతి మంతుల్లా మాట్లాడుతున్న తీరుపై ప్రజలు ఆలోచన చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో బాగంగా శుక్రవారం మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడ, మహాలక్ష్మి దేవాలయం ఏరియా, వడ్ల వాడ, ఉస్మాన్ పుర, సుభాష్ నగర్, మర్రి వాడ, అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మ వాడ…..ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లకు మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయా వార్డుల్లో ప్రజలను కలుస్తూ పర్యటించారు. అనంతరం ప్రధాన కూడలిలో ఆయన మాట్లాడుతూ మంథని ప్రజలను అమాయకులని బావించిన కాంగ్రెస్సోళ్లు మళ్లీ మళ్లీ మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు. మనం ఆలోచన చేయకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని చెప్పడం నా బాధ్యతగా మీ ముందుకు వచ్చానని ఆయన అన్నారు.
55ఏండ్లలో ఎమ్మెల్యేగా, సర్పంచ్‌లుగా కాంగ్రెస్ పార్టీ వాళ్లే పాలన చేశారని, ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్సోళ్లు మంథనికి ఏం చేశారో చూశారని అన్నారు. అనేక ఏండ్లు కాంగ్రెస్ పాలనతో మంథని ప్రజలు కష్టాలు, ఇబ్బందులు అనుభవించిన విషయం వాస్తవం కాదా అన్నారు. మన ఓట్లతో గెలిచి పదవులు పొందినోళ్లు మన ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. మంథనిలో అత్యధికంగా ఉన్న బీసీలు, కాపులపై కాంగ్రెస్సోళ్లు కక్ష్యసాధించారని, మన కులాన్ని ద్వేషించారని, చులకనగా చూసినోల్లు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని ఆయన అన్నారు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని, మళ్లీ 2014లో పోటీ చేస్తే మంథని ప్రజలు ఆదరించి ఆశీర్వదించారని అన్నారు. మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అయిన నాలుగేండ్లలో అనేక అభివృద్ది పనులు చేశామని, పేదలకు తనవంతు సేవలు అందించానని ఆయన గుర్తు చేశారు. మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడ ప్రజలు ఎంతో ప్రోత్సాహం అందించారని, వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదన్నారు. మళ్లీ ఈసారి కూడా పోచమ్మవాడ ప్రజలు ముందుకొచ్చి తనకు మద్దతుగా నిలువడం ఆనందంగా ఉందన్నారు. నిన్నా మొన్నటి వరకు ఏ సాయం అడిగినా పైసా లేదని, ఏ పని అడిగినా మా ప్రభుత్వం లేదని చెప్పినోళ్లు ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం నోట్ల సంచులతో తిరుగుతున్నారని, నాయకులను కొనుగోలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఇన్నేండ్ల కాలంలో ఏనాడైనా మన బిడ్డల చదువులకు, పెండ్లిళ్లకు, ఆస్పత్రుల్లో వైద్యానికి పైసా సాయం చేశారా అని ఒక్కసారి ఆలోచన చేయాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన నాయకులు మళ్లీ నాలుగేండ్ల తర్వాత మన వాడల్లో ఓట్లకోసం అడుగు పెట్టారనే విషయాన్ని గుర్తించాలన్నారు.
76ఏండ్లలో మంథని చరిత్రలో ఒక బీడ్డగా తాను ఈ స్థాయికి ఎదిగానని, కాంగ్రెస్‌ను నమ్మిమోసపోతే మల్లీ ఓ బీసీ బిడ్డ ఎదుగాలంటే మరో 76ఏండ్లు పడుతుందని, బీసీలకు ఎదిగే అవకాశం ఇవ్వరని ఆయన అన్నారు. ఓట్ల కోసం అన్నం పెట్టనోళ్లు ఆరు అబద్దాల పథకాలతో వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ పథకాలు తప్ప ఇక్కడి ఎమ్మెల్యే సొంతంగా ఏమీ చేస్తారో, ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పడం లేదని విమర్శించారు. వాళ్లు ఏమీ చేయరని, చేసే వాళ్లను అడ్డుకుంటారని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంథనిని అన్నివిధాలుగా అభివృధ్ది చేశామని, మీ ఇంటి ముందే అబివృధ్ది ఆనవాళ్లు కన్సిస్తాయని ఆయన గుర్తు చేశారు. ఆనాడు మంత్రిపదవిలో ఉన్నోళ్లను గడ్డిపరకలెక్క పక్కన పెట్టి సర్పంచ్‌గా గెలిపించుకున్న మంథని ప్రజలు ఒక్కతాటిపైకి రావాలని, కాపుల సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని, బీఆర్‌ఎస్ ఎన్నికల మేనీఫోస్టలో పొందుపర్చిన ప్రతి పథకం ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మరిన్న సొంత పథకాలు అమలు చేస్తానని, పేదవర్గాలకు ఇంటి నిర్మాణాలు, ఆడబిడ్డల పెండ్లిళ్లు, బీదబిడ్డలకు ఉన్నత చదువులు చదివించేబాధ్యత తీసుకుంటానని ఆయన హమీ ఇచ్చారు. అబద్దాల కాంగ్రెస్‌కు చరమగీతం పాడి మంథనికి వెలుగులు వచ్చేలా బీఆర్‌ఎస్ పార్టీని, తనను ఆశీర్వదించి ఆదరించాలని ఆయన కోరారు. అలాగే ఈనెల 7న మంథనిలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు బారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.