అదిలాబాద్, నవంబర్ 16, (వాయిస్ టుడే ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నియోజక వర్గం ఆ నియోజక వర్గం, ఈ గ్రామం.. ఆ గ్రామం అన్న తేడా లేదు. అన్ని చోట్లా అవే నిరసనలు, అవే ధర్నాలు. ఆందోళనలతో ఊరురా గో బ్యాక్ నినాదాలే వినిపిస్తున్నాయి. పదేళ్లుగా మా గ్రామాలకి ఏం చేశారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు జనం. ముధోల్ , ఖానాపూర్ , మంచిర్యాల , బెల్లంపల్లి నియోజక వర్గాల్లో బలంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వరుస నిరసన సెగలతో అసహనానికి గురవుతున్నారు నేతలు. ఇంకా పదిహేను రోజులే మళ్లీ మేమే గెలుస్తాం.. అప్పుడు మీ సంగతేంటో చూస్తాం అంటూ మాస్ వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారు అభ్యర్థులు. మరో వైపు దాడులు ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.నిర్మల్ జిల్లాలోని ముధోల్, ఖానాపూర్ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విఠల్ రెడ్డి, జాన్సన్ నాయక్‌లకు చుక్కలు చూపిస్తున్నారు జనాలు. ఎక్కడికి ప్రచారానికి వెళ్లిన మా గ్రామాలకు ఏం అభివృద్ది చేశారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. స్థానికులకు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు అండగా నిలవడంతో ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముధోల్ నియోజక వర్గంలో అయితే అడుగడుగున ప్రచారానికి అడ్డంకులు ఎదురవుతుండటం, గ్రామగ్రామాన నిరసన సెగలు స్వాగతం పలుకుతుండటంతో ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తానూర్ మండల జోలా(కే), నర్సాపూర్ మండలంలోని గొల్లమడ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో స్థానిక యువకులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడి నుండి మొదలైన నిరసన జ్వాల బీఆర్ఎస్ ప్రచార రథ ఎక్కడికి వెళితే అక్కడ సాగుతూనే ఉంది.ఇదే ముధోల్ నియోజకవర్గంలోని తానూరు మండలం జాహౌల( బి) గ్రామం రోడ్ షోలో ను సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. గ్రామంలో ప్రచారానికి వెళ్ళిన విఠల్ రెడ్డికి ఇక్కడ కూడా ఛేదు అనుభవం ఎదురైంది. 2017లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఒక ఎకరం భూమిని ఇచ్చిన నిర్వాసితులకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదని డిమాండ్ చేస్తూ విఠల్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు స్థానికులు. లోకేశ్వరం మండలం వాటోలి గ్రామంలోనూ ఇదే తంతు. విఠల్ రెడ్డి ప్రచారాన్ని స్థానికులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారంలో భాగంగా వటోలి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ప్రసంగిస్తుండగా స్థానిక యువకులు అడ్డుకున్నారు. 10 ఏళ్లల్లో మా గ్రామం ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా అని నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అనుచరులు స్థానికులతో వాగ్వాదానికి దిగారు. తోపులాటలో ఇద్దరికి గాయాలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.అటు ముధోల్ మండలం గన్నొర గ్రామంలోను సేమ్ టూ సేమ్ సీన్. బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి కి మద్దతుగా ప్రచారానికి వెళ్ళిన రమాదేవిని అడ్డుకున్నారు స్థానిక యువకులు , బీజేపీ శ్రేణులు. ప్రచారానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాకుండా మీరెందుకు వస్తున్నారని నిలదీశారు. నచ్చ చెప్పే ప్రయత్నంచేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు యువకులను నెట్టేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీన్ లోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ – బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది. నిరసన కారులను పోలీసులు చెదరగొట్టారు. అయితే పోలీసులు ఏకపక్షంగా బీజేపీ కార్యకర్తలను కొట్టారని ముధోల్ పోలీస్ స్టేషన్ ముందు బైటాయించి ఆందోళన చేపట్టారు బీజేపీ కార్యకర్తలు.ఒక్క ముధోల్ లో మాత్రమే కాదు, అటు మంచిర్యాల, ఖానాపూర్, బెల్లంపల్లి నియోజక వర్గాల్లోనూ సేమ్‌సీన్ కొనసాగుతోంది. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే దివాకర్ రావుకు నిరసనగా దండెపల్లి, హజీపూర్ మండలాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఖానాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్‌కు వ్యతిరేకంగా కడెం మండలంలో వరుస నిరసనలు కొనసాగుతున్నాయి. కొత్త, పాత మద్దిపడగ గ్రామాల్లో జాన్సన్ ను అడ్డుకుని నిలదీశారు స్థానికులు. బెల్లంపల్లిలోను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నిరసన సెగలు తప్పడం లేదు. అయితే ఇంత జరుగుతున్నా.. ఇదంతా కామన్. మళ్లీ 15 రోజుల్లో మేమే అదికారంలోకి వస్తాం. మా తడాఖా ఏంటో చూపిస్తాం అంటున్నారు నిరసనలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు.