- Advertisement -
డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ
Drone pilot training for Dwakra women
నెల్లూరు, నవంబర్ 21, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ మధ్య ఏర్పాటు చేసిన డ్రోన్ సదస్సులో హామి ఇచ్చినట్టుగా ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన మహిళలను ఇందులో శిక్షణ ఇస్తారు. దీంతో వ్యవసాయ పనుల్లో కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, రైతుల డబ్బులు ఆదా చేసేలా యంత్రాగాన్ని సిద్ధం చేస్తోంది. ఈ కాలంలో వ్యవసాయం అంటే చిన్న విషయం కాదు. పంట పండించేందుకు సిద్ధమైనప్పటి నుంచి ఆ పంట ఇంటికి వచ్చే వరకు కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చు, కూలీల కొరత, గిట్టుబాటు ధర ఈ మూడే నేటి తరం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. వీటి కారణంగానే రైతు వ్యవసాయానికి దూరం అవుతూ వస్తున్నాడు. అందుకే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది కూలీల, ఖర్చులు తగ్గించేందుకు ప్లాన్స్ వేస్తోంది. అందులో భాగంగా ఎరువులు పిచికారీ చేయడం లాంటి పనులు చేసే కూలీలు దొరకడం కష్టం. రోజుల తరబడి చేయించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికే కనిపించకుండానే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందులో వీటి వాడకం కూడా మోతాదుకు మించడమో లేకపోతే తగ్గడమో జరుగుతుంది. ఇలాంటి బెడద లేకుండా ఉండేందుకు ప్రభుత్వం డ్రోన్‌లను రంగంలోకి దించుతోంది. ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులకు డ్రోన్స్ వినియోగించేలా ప్రయత్నాలు ప్రారంభించిది. ఈ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు ఇవ్వబోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని పక్కగా అమలు చేయాలని భావిస్తోంది. దీని కోసం డ్వాక్రా సంఘాల్లోని మహిళలను ఎంపిక చేసి డ్రోన్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు లబ్దిదారులను ఎంపిక చేయాలని డీఆర్డీఏ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఎంపికైన వారికి రాయితీపై డ్రోన్లు సరఫరా చేయనుంది. ఈ సీజన్ నుంచే డ్రోన్లు మంజూరు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీని ద్వారా మహిళలకు జీవనోపాదితోపాటు రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయని అంటున్నారు. అంతే కాకుండా మందులు పిచికారీ చేసేటప్పుడు కూలీలు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. వాటి బారి నుంచి కూడా రక్షించుకోవచ్చు. కొన్నిసార్లు ఏపుగా పెరిగిన చేల్లోకి రైతులు, కూలీలు వెళ్లి మందులు చేయడం కష్టంతో కూడుకున్న పని. పంట కూడా నాశనం అవుతుంది. డ్రోన్లతో సులభంగా పని పూర్తి చేయవచ్చు. ఎంపిక చేసిన మహిళలకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తారు. ఒకరికి రిమోట్ పైలట్‌గా ట్రైనింగ్ ఇస్తే… ఆ కుటుంబంలోనే మరొకరికి ఫిటింగ్, మెకానికల్, మరమ్మతులపై శిక్షణ ఇస్తారు. వారిని డ్రోన్ అసిస్టెంట్ అంటారు. వాళ్లకు ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఇలా శిక్షణ తీసుకున్న వాళ్లకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. గ్రామంలోని వ్యవసాయ పనులకు ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దుతారు. శిక్షణ పొందిన వాళ్లకు 10 లక్షల విలువ చేసే డ్రోన్‌ను అందిస్తారు. ఇందులో 80 శాతం రాయితీ ఇస్తారు. అంటే లబ్ధిదారులు 2 లక్షలు చెల్లిస్తే మిగతా 8 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. పొలంలో మందులు, ఎరువులు పిచికారీ చేయడం, డ్రోన్లకు అమర్చే కెమెరాలతో ఫొటోలు తీయడం, చీడపీడలను గుర్తించడంపై శిక్షణ ఇస్తారు. ఆ ఫొటోలను వ్యవసాయ అధికారులకు పంపించి సూచనలు తీసుకునేలా వారికి ట్రైనింగ్ ఉంటుంది.
- Advertisement -