వరంగల్ లో మందుల దందా..
వరంగల్, మార్చి 23
వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్ (ప్రాంతీయ నేత్ర వైద్యశాల)లో మందులదందా బయటపడింది. అందులో పని చేసే ఉద్యోగి ఒకరు ప్రభుత్వం సరఫరా చేసే మందులను ప్రైవేటు మెడికల్ స్టోర్ లకు అమ్ముకుంటున్నాడు.కొన్ని సంవత్సరాల నుంచి ఈ దందా సాగిస్తూ అక్రమంగా సంపాదిస్తుండగా.. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు ఆయన గుట్టురట్టు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ మందులు బయటకు పంపిస్తున్న ఉద్యోగితో పాటు ఆయన నుంచి కొనుగోలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.వరంగల్ నగరంలో కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన తలకోటి నాగేందర్ కొన్నేళ్ల నుంచి వరంగల్ రీజినల్ కంటి ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చే జీతంతో సంతృప్తి పడని ఆయన ఆసుపత్రిలోనే అక్రమ దందాకు తెరలేపాడు.హనుమకొండలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి కంటి ఆసుపత్రికి ట్యాబ్లెట్స్, ఐ డ్రాప్స్ తదితర మందులు సరఫరా అవుతుండగా.. వాటితో నాగేందర్ అక్రమ బిజినెస్ మొదలు పెట్టాడు. వివిధ ప్రాంతాల నుంచి కంటి సమస్యలతో వచ్చే పేషెంట్లకు డాక్టర్లు మందులు రాస్తుండగా.. ప్రిస్క్రిప్షన్ లో రాసిన వాటికంటే ఎక్కువ క్వాంటిటీ మందులు లెక్కల్లో చూపిస్తూ వాటిని గుట్టుగా తన ఇంటికి చేరవేసేవాడు.కంటి ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా పని చేస్తున్న నాగేందర్ కు, హైదరాబాద్ కు చెందిన బలరాం దాసుతో పరిచయం ఏర్పడింది. నాగేందర్ తాను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చే మందులను బలరాంకు అప్పజెప్తే ఆయన వాటిని హైదరాబాద్కు తీసుకెళ్లేవాడు. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లు తొలగించి, ఆ మందులన్నింటినీ వివిధ మెడికల్ స్టోర్ లకు ఎక్కువ ధరకు సరఫరా చేసేవాడు.ఇలా ఇద్దరు కలిసి గుట్టుగా చిన్నపాటి నెట్ వర్కే నడిపించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ దందా సాగిస్తూ ఇద్దరూ పెద్ద మొత్తంలో సంపాదించారు. కాగా ఇండెంట్ పెట్టిన మందులు పెద్ద మొత్తంలో మాయమవుతున్నా అక్కడి అధికారులకు అనుమానం కలగకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే ప్రభుత్వ కంటి సంబంధిత మందులను అక్రమంగా కాజేసి డబ్బులకు బయట అమ్ముతున్న విషయం టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలిసింది. దీంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు గుట్టుగా వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే బలరాం దాసు మందులు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ నుంచి వరంగల్ కు వచ్చినట్లు అధికారులకు సమాచారం అందింది.దీంతోనే టాస్క్ ఫోర్స్, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు నాగేందర్ ఇంట్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నాగేందర్ ఇంట్లో పెద్ద మొత్తంలో కంటి ఆసుపత్రికి సంబంధించిన మందులు లభించాయి. దీంతో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు తదుపరి విచారణ నిమిత్తం వారిని ఇంతేజార్ గంజ్ పోలీసులకు అప్పగించారు.డ్రగ్ ఇన్స్పెక్టర్ అరవింద్ పంచనామా నిర్వహించి ఆ మందులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాటిలో 34 బాక్సుల్లో రూ.69,360 విలువైన యాంటీ బయటిక్ ట్యాబ్లెట్స్, రూ.11,484 విలువైన ఐ డ్రాప్స్ ఉన్నాయి.కొన్నేళ్లుగా ఫార్మసిస్ట్ నాగేందర్ మందుల దందా చేస్తుండగా.. ఆసుపత్రికి చెందిన ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నేళ్ల నుంచి నేరుగా ఫార్మసి నుంచే మందులు సరఫరా చేస్తుంటే ఆ విషయం ఆఫీసర్ల దృష్టికి రాకపోవడం పట్ల సందేహాలు వినిపిస్తున్నాయి.ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి పోలీస్ అధికారులు, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
వరంగల్ లో మందుల దందా..
- Advertisement -
- Advertisement -