బ్రతుకు దెరువు కోసం డ్రగ్స్
హైదరాబాద్, జూలై 19,
Drugs for survival
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ భూతాన్ని అరికట్టేందుకు పోలీసులు అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే పలువురు నైజీరియన్లు హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. ఇటీవల నార్సింగ్ పిఎస్ పరిధిలో పోలీసులు చేదించిన డ్రగ్స్ రాకేట్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ డ్రగ్స్ దందా మొత్తం నైజీరియా టు హైదరాబాద్ వయా ఢిల్లీ బెంగళూరుగా నడిచినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.ఈ మొత్తం వ్యవహారంలో నైజీరియాకు చెందిన ఓనోహ బ్లెస్సింగ్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో ఒనూహా గురించి కీలక అంశాలు ప్రస్తావించారు. నైజీరియా నుండి వస్తున్న డ్రగ్స్‌ను దేశవ్యాప్తంగా చాలా మెట్రో నగరాలకు ఈమె ద్వారానే డ్రగ్ సరఫరా అవుతున్నాయి. ఇంటర్ వరకు చదువుకున్న ఓనుహాకు ఒక తమ్ముడు ఉన్నాడు. తన తండ్రి నైజీరియాలో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంది. ఈమెకు 2017లో ఫేస్బుక్ ద్వారా బ్లెస్సింగ్ అనే నైజీరియన్ మహిళ పరిచయమైంది. బెంగళూరులో స్థిరపడిన బ్లెస్సింగ్ స్థానికంగా ఒక బట్టల దుకాణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఫేస్బుక్ ద్వారా ఇద్దరికీ పరిచయం అయింది. తనను ఆర్థికంగా ఆదుకోవాలని ఓనుహ కోరటంతో రమ్మని చెప్పింది. అనేక ప్రయత్నాల ద్వారా వీసా పొందిన ఒనహా 2018లో బెంగళూరుకు చేరుకుంది. అక్కడ బ్లెస్సింగ్ తో కలిసి బట్టల దుకాణంలో పనిచేసింది. తనను బెంగళూరుకు రప్పించేందుకు మూడు లక్షల రూపాయలు ఖర్చు అయిందని బ్లెస్సింగ్ ఓనుహతో చెప్పింది. తన బట్టల దుకాణంలో పనిచేస్తూ వచ్చిన జీతాన్ని ఓనూహా బ్లెస్సింగ్‌కు ఇచ్చేది. అదే సమయంలో మరో నైజీరియన్ ఎబూకా పరిచయం అయ్యాడు. తాను డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నానని తనకు సహకరిస్తే పదివేల రూపాయల కమిషన్ ఇస్తానని చెప్పాడు.ఇదే సమయంలో బ్లెస్సింగ్‌కు వివాహం కుదరటంతో ఆమె బట్టల దుకాణాన్ని క్లోజ్ చేసి నైజీరియా వెళ్ళిపోయింది. దీంతో తన ఖర్చులకు మరో మార్గం లేక డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసుల ముందు ఒనుహా ఒప్పుకుంది. తనను ఆర్థికంగా ఆదుకున్న బ్లెస్సింగ్ పేరును తన పేరు జోడించుకుంది. అలా 2018 నుండి ఎబుకతో కలిసి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగింది. ఇతర దేశాల నుండి వస్తున్న డ్రగ్స్‌ను ఢిల్లీకి వెళ్లి తీసుకువచ్చే బాధ్యతను ఒనుహాకు అప్పగించాడు. వెళ్లిన ప్రతిసారి తనకు కమిషన్ రూపంలో పదివేల రూపాయలు ఇచ్చేవాడు. ఈతరణంలోనే నార్సింగ్ పోలీసులకు పట్టుబడింది. ఢిల్లీ నుండి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను బండ్లగూడ సన్ సిటీలోని ఒక అపార్ట్మెంట్లో డ్రగ్ పెడ్లర్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ కేసులో మొత్తం 20 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిలో ఏడుగురు డ్రగ్ పెడ్లర్లు కాగా 13 మంది కన్జ్యూమర్లుగా ఉన్నారు. వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు.