మూగబోయిన బిఎస్ఎన్ఎల్
నాలుగు రోజుల నుంచి.ఇబ్బంది పడుతున్న వినియోగదారులు
డుంబ్రిగూడ
మండలంలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సౌకర్యం గత నాలుగు రోజుల నుంచి మూగ బోవడంతో మండలంలోని బిఎస్ఎన్ఎల్ ఫోన్ వినియోగదారులు, ఇంటర్నెట్ వినియోగదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ ఫోన్ వినియోగదారులతో పాటు వివిధ పనుల నిమిత్తం సెంటర్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కోసం బ్రాడ్ బాండ్ సౌకర్యాన్ని కల్పించుకొని ఉన్న వారికి పనులు జరగడం లేదు. దీంతో సకాలంలో ప్రభుత్వ కార్యాలయంలో పనులు జరగకపోవడంతో ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఇబ్బంది పడకు తప్పడం తప్పని పరిస్థితిలో తమ సొంత డబ్బులను పెట్టుబడి చేసి జియో, ఎయిర్టెల్ వంటి నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని పనులు చేసుకుంటున్నారు. వ్యాపార అవసరాల కోసం ఇంటర్నెట్ కేంద్రాల్లో ముందుగా బిఎస్ఎన్ఎల్ బ్రాస్బెండ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అయితే గత నాలుగు రోజుల నుంచి సిగ్నల్స్ సౌకర్యం లేక వ్యాపారాలు జరగకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఇంటర్నెట్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ టవర్స్ పరిధి ప్రాంతాల్లో ఉన్న గ్రామాల గిరిజనులకు అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ కు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఫోన్లు చేసుకోవాలన్న ఫోన్లు అవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. గత నాలుగు రోజుల నుంచి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మూగబోయినా సంబంధిత అధికారులు మరమత్తు చేసి సిగ్నల్ సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం చేయడంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మండలంలో మూగబోయిన బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సౌకర్యాన్ని పునరుద్ధరించి వినియోగదారులకు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.