ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యా బోధనకు కృషి
మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, జూలై 18
Efforts for quality education in government schools
సీయం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యా బోధనకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపు తీసుకువచ్చిందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం చిన్నంబావి మండలం వెలటూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో రూ. 14.75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అమ్మ ఆదర్శ పాఠశాల భవనాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. విద్యార్థులతోనూ మాట్లాడారు. విద్యా బోధన ఎలా ఉంది.. మధ్యాహ్న భోజనం బాగుంటుందా.. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చక్కగా పాఠాలు విని మంచి మార్కులు సాధించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం వసతుల కల్పన కోసం తాగునీరు, విద్యుత్, బాలికల టాయిలెట్స్ సుందరీకరణ పనులు చేపట్టిందని తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో సీఎస్ఆర్ ఫండ్స్ తో అనేక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశానని మంత్రి చెప్పారు. వెలటూర్ హైస్కూల్, ప్రైమరీ స్కూల్ లో వసతుల కల్పనకు రూ. 25 లక్షల కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని,వారి పర్యవేక్షణ పెంచటం ద్వారా బడిలో చేరే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు. ప్రైవేటు బడి మోజును తగ్గించి నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లలను చేర్పించేందుకు స్వయం సహాయక సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.